Breaking News Live Telugu Updates: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం, రోడ్లన్నీ జలమయం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 08 Sep 2022 09:43 PM
హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం, రోడ్లన్నీ జలమయం 

హైదరాబాద్ భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడికక్కడ రోడ్లపై నీరు చేరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మేడ్చల్ జిల్లా జీడీమెట్ల  , కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం,షాపూర్ నగర్,గాజులరామరంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం దాటికి పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీడిమెట్లలో వర్షం లోనే  గణపతి నిమజ్జనానికి భక్తులు తరలవెళ్తున్నారు.  

జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు ఉపాధి హామీ కూలీలు మృతి 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్లు పక్కన చెట్లకు నీరు పోస్తున్న ఉపాధి హామీ కూలీలపైకి లారీ దూసుకొచ్చింది. ఈప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మల్లబోయినపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  

Udayagiri MLA: ఉదయగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో జగన్ తనకే సీటు ఇస్తారని చెప్పుకునే క్రమంలో తనకంటే నియోజకవర్గంలో మొగోడు లేరని, కొమ్ములొచ్చినోళ్లు అసలే లేరని అన్నారు. జలదంకిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈసారి కూడా జగన్ టికెట్ ఇస్తే తానే పోటీ చేస్తానని అన్నారు. తనని తలపైన, భుజంపైన కొట్టేవారు ఎక్కువయ్యారని, అందుకే తాను తన జాగ్రత్తలో ఉన్నానని చెప్పారు. తన నియోజకవర్గంలో తనను కాదని పోటీ చేసేవారు ఎవరూ లేరన్న చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం పైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అసంతృప్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఆఫీసును ప్రభుత్వం చులకనగా చూస్తోందని, తీవ్రమైన వివక్ష చూపిస్తోందని విమర్శించారు. ఒక రాష్ట్ర గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు. 

Nizamabad Bus Accident: డిచ్ పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా

నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. డిచ్‌పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ డీలక్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులను బయటికి తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి బోధన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Divya Vani meets Eatala Rajender: ఈటల రాజేందర్ ను కలిసిన దివ్యవాణి

ఇటీవలి వరకూ ఏపీలోని తెలుగు దేశం పార్టీలో ఉండి రెండు నెలల క్రితం అసహనంతో ఆ పార్టీ వీడిన నటి దివ్యవాణి తెలంగాణ రాజకీయాలవైపు చూస్తున్నారు. గురువారం ఉదయం ఆమె హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలిశారు. బీజేపీలో చేరతానని ఆమె ఈటలను కోరినట్లు తెలుస్తోంది. అయితే, అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం చెబుతామని ఈటల చెప్పినట్లుగా సమాచారం. 

Rajamundry: రాజమండ్రిలో లోన్ యాప్ బాధితులు, భార్యాభర్తల ఆత్మహత్య

రుణ యాప్ ల వలలో పడి రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు దీని పరిస్థితిపై చలించారు. దీంతో వారి చిన్నారులు తేజస్వి నాగసాయి (4), లిఖిత శ్రీ (2) అనాథలయ్యారు. వీరు ఇద్దరికి చెరో రూ. ఐదు లక్షలు సహాయం అంద చేయాలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలతకి సీఎం ఆదేశాలు ఇచ్చారు. పిల్లలు ఇద్దరి సంరక్షణ కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వేధింపులకు పాల్పడ్డ లోన్ యాప్ నిర్వహకులపై దర్యాప్తు ప్రారంభించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Background

తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో ఈ మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కర్ణాటక వరకు ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఉత్తర, దక్షిణ ద్రోణి పయనిస్తూ ఉంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. బుధవారం (సెప్టెంబరు 7) తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఈ నెల 9 వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఇప్పటికే రెండు రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.


దక్షిణ కోస్తాంధ్రలో కాస్త తక్కువ
ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొన్నారు. కానీ, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.


ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
ఈ భారీ వర్షాల ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో ఉంటుందని తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడేందుకు కూడా అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోంగా ఉంటుంది కాబట్టి, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.


తెలంగాణలో ఇలా..
తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో పసుపు రంగు, నారింజ రంగు అలెర్ట్స్ జారీ చేసింది. 


ఈ జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేసిన వివరాలు, అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వర్షాల ప్రభావం ఆదిలాబాద్‌, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. 


సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, ఖమ్మం నల్గొండ, మెదక్‌ మహబూబాబాద్‌, జనగాం, సిద్ధిపేట, హైదరాబాద్‌, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. రేపు (సెప్టెంబరు 9) కరీంనగర్‌, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, మల్కాజ్‌గిరి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, నల్గొండ, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, వరంగల్‌, రంగారెడ్డి, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, నిర్మల్‌, నిజామాబాద్‌ లో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.