ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, అసెంబ్లీ సమావేశాలు, సీపీఎస్ పై చర్చ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 07 Sep 2022 11:47 AM
రాహుల్ భారత్ జోడో యాత్ర కన్నా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలి: పొంగులేటి సుధాకర్

తిరుపతి : ప్రపంచ అగ్ర నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా డేటా ఏజెన్సీ గుర్తించిందని బీజేపీ తమిళనాడు ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ అన్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆయన పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్నా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలని, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ అమెరికా కన్నా చాలా బాగుందన్నారు. ప్రపంచ అగ్ర నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా డేటా ఏజన్సీ గుర్తించిందని, కేంద్రం సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి పని చేసి అభివృద్ధి సాధించాలన్నారు. విభజన సమస్యలు ఉంటే సామరస్యంగా తీర్చుకోవాలని, తమిళనాడులో బిజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..

Polavaram: మేం ప్రశ్నలు వేస్తే ఎందుకు స్పందించరు - అంబటి

పోల‌వరంపై వైసీపీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ ఎందుకు స‌మాధానం ఇవ్వ‌టం లేద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. కేంద్రం క‌ట్టాల్సిన ప్రాజెక్ట్ ను ఏపీ ప్ర‌భుత్వం ఎందుకు భారం మోయాల్సి వ‌చ్చిందో చెప్పాల‌న్నారు. టీడీపీ చేసిన త‌ప్పుల‌ను వైసీపీపై రుద్దేందుకు ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని అన్నారు. టీడీపీ నేత‌లు ఎన్ని ర‌కాలుగా చౌక‌బారు ప్ర‌క‌ట‌న‌లు చేసినా ఉప‌యోగం ఉండ‌ద‌ని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ హాయాంలో శంకుస్థాపన చేసిన రెండు బ్యారేజీలు, జగన్ సీఎం అయ్యాక యుద్ధ ప్రాతిపదికన నిర్మించామ‌ని, టీడీపీ నాయకులు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అంబ‌టి అన్నారు. టీడీపీ హయాంలో రెండు బ్యారేజీలను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. 14 ఏళ్ళు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ మొదలైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ భేటీలో ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభించాలని కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ నెల 19 నుంచి 24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించారు. కీలకమైన సీపీఎస్ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

నిమజ్జనాలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించలేదు: దానం నాగేందర్

ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. అయితే కోర్టు ఆదేశాలను అనుసరించి, హుస్సేన్ సాగర్ లో కేవలం మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించినట్లు స్పష్టం చేశారు. 

AP Assembly: ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఇవాళ జరిగే  కేబినెట్‌ భేటీలో అధికారికంగా ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. ముందు 19వ తేదీ నుండి నిర్వహించాని అనుకున్నప్పటికి సీఎం షెడ్యూల్ ముందుగా ఫిక్స్ అయిన కార్యక్రమాల నేప‌థ్యంలో 15 నుండి నిర్వహించ‌నున్నారు. ఎప్పటి వ‌ర‌కు జ‌రుగుతాయ‌నేది, బీఎసీలో నిర్ణయం తీసుకుంటారు.

Background

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణలో సోమవారం కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా, ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమొరిన్ ప్రాంతం, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక లోపల 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఏపీ, తెలంగాణలో మరో 4 రోజులు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 


తెలంగాణలో వర్షాలు 
తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిన్న ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. 


నేడు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు. సెప్టెంబర్ 10 వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైంది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడితే, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
కోస్తాంధ్రలో విస్తారంగా భారీ వర్షాలు పడతాయి. కొన్ని చోట్లలో ఎండ కాస్తున్నా కూడా పార్వతీపురం మణ్యం, శ్రీకాకుళం (పశ్చిమ భాగాలు), విజయనగరం, అనకాపల్లి జిల్లాలోని పలు భాగాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. చాలా కాలం తర్వాత రాజమండ్రి, కాకినాడ నగరాలతో పాటుగా తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని చాలా భాగాల్లో వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షాలు లేక, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అన్నదాతలు వర్షాల కోసం చూస్తున్నారు.   


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, చిత్తూరు జిల్లాలోకి విస్తరించాయి. ఆ తర్వాత అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కడప జిల్లా పశ్చిమ ప్రాంతాలు, కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. పల్నాడు జిల్లా, తిరుపతి జిల్లా పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ వర్ష సూచన ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.