Breaking News Live Telugu Updates: శ్రీనివాసుడి సేవలో కాజల్ అగర్వాల్, భర్తతో కలిసి తొలిసారి తిరుమలకు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Sep 2022 01:36 PM
KTR కు ఘన స్వాగతం, చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులార్పించిన మంత్రులు

ఆదిలాబాద్ జిల్లాల్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ సబితా ఇంద్రారెడ్డి, ఐకే రెడ్డి పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రులను టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్థానిక మావల జాతీయ రహదారి నుంచి జిల్లా కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై కేటీఆర్. జై టిఆర్ఎస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కు ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు.

Rangareddy News: నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని సోలిపూర్ గ్రామ శివారులోని ఓ వెంచర్ లో నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అక్షిత్ గౌడ్ ఫరీద్, ఫారిన్, అనే ముగ్గురు మృతి చెందారు. నీటిలో మునిగి మృతి చెందిన వీరిని గ్రామస్తులు బయటికి తీశారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Minister KTR: ఆదిలాబాద్ పర్యటనకు మంత్రి కేటీఆర్, మధ్యాహ్నం బాసర ట్రిపుల్ ఐటీకి

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుండి ఉదయం 9:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడకు చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శిస్తారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ అభివృద్ధిని రోడ్డు మార్గం గుండా పరిశీలిస్తారు. అనంతరం పట్టణంలో బీడీఎన్ఏ డాటా సొల్యూషన్ ఉద్యోగులతో మాట్లాడతారు. ఆపై అక్కడి నుంచి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శిస్తారు. అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేసి, బాసర నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

Tirumala News: శ్రీనివాసుడి సేవలో కాజల్ అగర్వాల్, భర్తతో కలిసి తొలిసారి తిరుమలకు

తిరుమల శ్రీవారిని సినీ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..అనంతరం ఆలయ వెలుపల కాజల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తన భర్తతో కలిసి మొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు.

Background

నైరుతీ రుతుపవనాలు చవరి దశకు వచ్చేశాయి. దీంతో నేడు అక్కడక్కడ వర్షాలు పడ్డా, సెప్టెంబర్ 27 నుంచి వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ. 


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather News)
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు ఓ మోస్తరు కురవనున్నాయి. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో 28, 29, 30 తేదీలు చాలా ముఖ్యమైనవి. ఈ మూడు రోజులు భారీ వర్షాలు పడేందుకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. కానీ మధ్యాహ్నానికి ఉక్కపోత సైతం అధికం కావడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో, యానాంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. అయితే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఎన్.టీ.ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈదురు గాలులు వేగంగా వీచనున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి.  అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.