Breaking News Live Telugu Updates: డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం బాధాకరం: మంత్రి హరీశ్ రావు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Feb 2023 10:11 PM
డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం బాధాకరం: మంత్రి హరీశ్ రావు

మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరం. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. 


టి. హరీశ్ రావు,
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి.

మెడికో ప్రీతి మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటన

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి పోరాటం ముగిసింది. ఆమె బ్రెయిన్ డెడ్ అయి మృతిచెందినట్లు ప్రకటించారు. ఆదివారం రాత్రి 9:10 గంటలకు ప్రీతి చనిపోయిందని వైద్యులు ప్రకటన చేశారు. 5 రోజులపాటు మృత్యువుతో పోరాడిన మెడికో ప్రీతిని బతికించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ మెడిసిన్ స్టూడెంట్ ప్రీతి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

పంజాబ్ జైల్లో గ్యాంగ్ వార్ - ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మృతి

పంజాబ్ జైల్లో గ్యాంగ్ వార్ జరిగి ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ చనిపోవడం కలకలం రేపింది. జైల్లో జరిగిన ఓ గొడవలో గ్యాంగ్ స్టర్స్ మన్ దీప్ తుఫాన్, మన్మోహన్ సింగ్ అక్కడిక్కడే మృతి చెందగా, మరో గ్యాంగ్ స్టర్ కేశవ్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు ఫేమస్ సింగర్ ముసేవాలా హత్య కేసులో నిందితులు అని తెలిసిందే.

అసమర్థ పాలన, అవగాహన లేని సిఎం జగన్ వల్ల సమస్యలు: నారా లోకేష్

చంద్రగిరి నియోజకవర్గం...  తనపల్లి లో లెవల్ కాజ్ వే ని పరిశీలించిన నారా లోకేష్.


2021 నవంబర్ లో వచ్చిన వరదలకు స్వర్ణ ముఖి నది పై ఉన్న 7 లో లెవల్ కాజ్ వే లు కొట్టుకుపోయాయని వివరించిన స్థానికులు.


పైపులు, మట్టి పోసి పైన రోడ్డు పోసారే తప్ప పూర్తిస్థాయిలో పటిష్ఠమైన కాజ్ వే లు నిర్మించలేదని చెప్పిన స్థానికులు.


మళ్లీ వరద వస్తే నాణ్యత లేకుండా వేసిన పైపులు, మట్టి కొట్టుకు పోవడం తో పాటు ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని వివరించిన తనపల్లి ప్రజలు.


 లోకేష్ మాట్లాడుతూ


అసమర్థ వైసిపి పాలన, అవగాహన లేని సిఎం జగన్ వలనే ఈ దుస్థితి ఏర్పడింది.


వర్షా కాలంలో కనీస అంచనాలు లేకుండా జగన్ ప్యాలస్ లో పడుకోవడం వలన అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయింది. 60 మందిని జగన్ పొట్టన పెట్టుకున్నారు.


నీటి నిర్వహణ లో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.


స్వర్ణముఖి నది పై ఉన్న 7 లో లెవల్ కాజ్ వే లు వరదల్లో దెబ్బతిన్నాయి. 


తత్కాలికంగా మట్టి, పైపులు వేసి చేతులు దులుపుకున్నారు.


వీటి వలన ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది.


చిన్న వర్షం వచ్చినా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. 


కాజ్ వే లు కొట్టుకుపోయి ఏడాది అవుతున్నా కనీసం ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి నిధులు కేటాయించకపోవడం దారుణం.


టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తాం.కాజ్ వే లు నిర్మిస్తాం.

Tirumala News: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్, ఏపీ హైకోర్టు జస్టిస్ వేణుగోపాల్, ఏపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, టిడిపి ఎమ్మెల్యే గన్నబాబు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణ మోహన్ రావు, టిడిపి ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, దీపక్ రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ‌ప్రసాదాలు అందజేశారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరం నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారని, నేటికీ యువగలం పాదయాత్ర ప్రారంభించి నెల రోజులు పూర్తవుతుందన్నారు. పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మరొకసారి శ్రీవారి అనుగ్రహం ఉండాలని, ఈ ప్రభుత్వంకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్థించినట్లు చెప్పారు. అడుగున యువకులం పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు మంచిగా ఉండాలని టిడిపి ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కోరారు.

Kakatiya University: కేయూలో ఐటీ దాడులు

కాకతీయ యూనివర్సిటీపై ఐటీ శాఖ అధికారులు ఒక్కసారిగా దాడులు చేశారు. పలుసార్లు డిమాండ్ నోటీసులిచ్చినా కేయూ అధికారులు 2016-17, 2017-18, 2018-19 ఏడాదులకు సంబంధించి ఆదాయ వ్యయాలకు రిటర్స్ దాఖలు చేయలేదు. దీంతో రూ. 200 కోట్లకు డిమాండ్ నోటీస్ ఇచ్చిన ఐటిశాఖ అధికారులు అందులో 20 శాతం రూ. 40 కోట్లు ట్యాక్స్ చెల్లించాలన్నారు. లేకుంటే యూనివర్సిటీ అకౌంట్స్ సీజ్ చేస్తామని ఇటీవల హెచ్చరించారు. తాజాగా దాడులు చేశారు.

Nirmal News: డాన్స్ చేస్తూ యువకుడు మృతి

పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో బరాత్ లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డీ (కే) గ్రామంలో చోటు చేసుకుంది. పార్డీ (కే) గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం జరిగింది. శనివారం పార్డి(కె)లో వివాహ వేడుకకు సంబంధించి విందు జరిగింది. ఇందులో పెళ్లి కుమారుని సమీప బంధువు. మిత్రుడైన మహారాష్ట్రలోని శివ్ ని గ్రామానికి చెందిన ముత్యం (19) అనే యువకుడు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు యువకుడిని లేపి పరిశీలించగా ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో హుటహూటిన వైద్య సేవల కోసం గాను బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

APSRTC Buses On Fire: హైదరాబాద్ - విజయవాడ రహదారిపై రెండు బస్సుల్లో మంటలు

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన రెండు బస్సుల్లో మంటలు అంటుకున్నాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. రెండు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న ‘వెన్నెల’ బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు పనిచేయలేదు. దీంతో ప్రయాణికులను వేరే బస్సుల్లో పంపించారు. అనంతరం సూర్యాపేట నుంచి ఏపీఎస్‌ఆర్టీసీకే చెందిన మరో బస్సును రప్పించారు. వైర్ల సాయంతో రెండు బస్సుల మధ్య బ్యాటరీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈలోపు సూర్యాపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో పెద్ద శబ్ధం వచ్చి మంటలు చెలరేగాయి. ఆ మంటలే మరో బస్సుకూ అంటుకుని రెండూ తగలబడ్డాయి.

Vijayawada Durga Temple: దుర్గగుడి ఉచిత క్యూలైన్ లో పాము పిల్ల కలకలం

దుర్గగుడి ఉచిత క్యూలైన్ లో పాము పిల్ల కలకలం


కిటికీ లో నుంచి క్యూలైన్ లోకి వచ్చిన కట్ల పాము


భయంతో పరుగులు తీసిన భక్తులు


వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది


కర్ర సాయంతో పామును కిటికీలో నుంచి బయటకే పంపిన సిబ్బంది


ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు

Chittoor Accident: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్ళి ముగ్గురు విద్యార్ధులు దుర్మరణం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం‌ జరిగింది. పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని గుడిపల్లె‌ మండలం, చిన్నశెట్టిపల్లె సమీపంలో ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొని ప్రక్కకు పడడంతో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ముగ్గురు విద్యార్ధులు సంఘటన స్ధలంలోనే మృతి చేందారు. అయితే మృతులు పిఈఎస్ మెడికల్‌ కళాశాల్లో మెడిసిన్ చదువుతున్న నెల్లూరు కు చేందిన వికాస్,కడపకు చేందిన ప్రవీణ్,మదనపల్లె ఇంజనీరింగ్ కళాశాలో ఇంజనీరింగ్ చదువుతున్న కడపకు చేందిన కళ్యాణ్ గా పోలీసులు గుర్తించారు. గుడుపల్లి మండలం, కుప్పం - పలమనేరు NH రోడ్డు నందు చిన్నాశెట్టిపల్లి సమీపంలో ఆదివారం వేకువజామున సుమారు 3-30AM రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితుని బర్త్డే పార్టీకి ముగించుకొని తిరిగి కుప్పంకు వెళ్తున్న సమయంలో మారుతి స్విఫ్ట్ కారులో కుప్పం వైపు వెళుతున్న సమీపంలో ముందు పోతున్న లారీని గుద్ధి  కారు ఎగిరి కుడివైపుకు పడగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. అయితే ఘటన స్ధలంకు చేరుకున్న గుడిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి మృతులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Background

పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 


తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతోంది. నేడు తెలంగాణలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సాధారణంగా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు, రాత్రి పూట చలి విషయంలో 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.9 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.









 


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 


ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
మరో 3 లేదా 4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ‘‘ఎల్-నినో ఏర్పడే అవకాశాలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి కాబట్టి రానున్న మూడు నెలల్లో ఎండల వేడి బాగా ఎక్కువ ఉండనుంది. పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లా-నినా ఇప్పుడు బాగా బలహీనపడింది. దీని ప్రభావం మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. మార్చి నుంచి మే నెలలో మనకు ఎండలు బాగానే కాస్తాయి.


కానీ గత మూడు సంవత్సరాలుగా సాధారణం కంటే తక్కువగానే ఎండలు ఉన్నాయి. చాలా మంది ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంది అని అనుకున్నారు, కానీ ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన కాదు. ఇది పసిఫిక్ లో ఏర్పడిన లా-నినా ప్రభావం. కాబట్టి రానున్న రోజుల్లో లానినా ఉండదు కాబట్టి. ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


2003, 2009, 2012, 2015, 2018 సంవత్సరాల్లో ఎల్-నినో ఏర్పడే తరుణంలో ఎండలు సాధారణం కంటే ఎక్కువగానే ఉండనున్నాయి. దీనికి తోడు మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్లడం జరిగితే వడగాల్పులు ఉండటం సాధారణం. మరి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.