Breaking News Live Telugu Updates: ప్రధానిపై దాడికి పీఎఫ్ఐ కుట్ర, ఆ పార్టీని నాశనం చేయాల్సిందే: బీజేపీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
చేవెళ్ల పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ జాగిర్ నార్సింగి శంషాబాద్ ప్రాంతాలలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటించారు. పండిత్ దీన్ దయాల్ జయంతిని పురస్కరించుకొని మణికొండ, నార్సింగ్ లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు, మణికొండలో బీజేపీ నేత వినోద్ ఇంట్లో అల్పాహారం స్వీకరించి, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేగం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు.
ఎస్ఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు
ఏలూరు జిల్లా పెదవేగి ఎస్ఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇద్దరు మహిళల మృతికి కారణమైన పెదవేగి ఎస్ఐ సత్యనారాయణ
కేసు నమోదులో జాప్యం చేసినందుకు, విధులలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్ఐ సత్యనారాయణను సస్పెండ్ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్.
తిరుమల శ్రీవారిని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఈనాటి నుండి తాను రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయబోను అని శ్రీవారి సాక్షిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాను రాజకీయ నాయకుడిని కానప్పటికీ అంతకు మించి రాజకీయ అంశాలు ప్రస్తావన, వ్యాఖ్యానాలు చేశానని అన్నారు. ఇకపై కేవలం పాలనా భాషాగా తెలుగు అభివృద్ధి, వికాసానికి తప్ప మరే దానిలో తలదూర్చబోనని అన్నారు. మంచో చెడో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంపై ఇప్పటికే మాట్లాడేశానని ఇక మాట్లాడటానికి ఏమి లేదని అన్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాధ్ తిలహరి, SBI ఛైర్మన్ దినేష్ కుమార్ఖరా లు వేర్వేరుగా కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఐసీఎస్, లష్కర్ ఉగ్రవాద మూలాలు కలిగి వాటిలో చేరి ప్రధానిపై దాడికి యత్నిస్తున్న పీఎఫ్ఐ పార్టీను ఏపీలో సమూలంగా నాశనం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో ఆయన పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తీవ్రవాద ప్రేరేపిత పార్టీ పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థ ఎస్డీపీఐను రాష్ట్రంలో నిషేధించాలని కోరారు. ఇక నిన్న టీటీడీ పాలకమండలిలో శ్రీవారి స్థిర ఆస్తుల విలువ 87 వేల కోట్లుగా శ్వేత పత్రాన్ని విడుదల చేయాడాన్ని ప్రశంసించారు. రాష్ట్రంలోని దేవాదాయ శాఖ కిందకు వచ్చే ఇతర దేవాలయాలను ఆస్తులను కూడా టీటీడీ తరహాలో బహిర్గతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు.
Background
తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, పశ్చిమ రాజస్థాన్ నుంచి వాయువ్య మధ్యప్రదేశ్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ ల మీదుగా దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వానలుంటాయని అలర్ట్ చేసింది ఐఎండీ. ఏపీలో సాధారణ నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Update)
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. వర్షం పడకపోతే మధ్యాహ్నం నుంచి ఉక్కపోత అధికంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు కాగా, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైంది. వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీచనున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం జిల్లా రాజం వైపు నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు విస్తరిస్తున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని చాలా భాగాల్లో వర్షాలంటాయి. అత్యధికంగా శ్రీకాకుళం - నరసన్నపేట పరిధిలో భారీ వర్ష సూచనతో పాటు పిడుగులు పడతాయని హెచ్చరించారు ఏపీ వెదర్ మ్యాన్. అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. విశాఖ నగరానికి దక్షిణ భాగాల్లో వర్షాలు కురుస్తాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రోజు తక్కువగా వర్షాలుంటాయి. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, గుంటూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ఎన్.టీ.ఆర్ జిల్లాల్లో ఈ రోజు తక్కువగా వర్షాలుంటాయి. ఈదురు గాలులు వేగంగా వీచనున్నాయి. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో చాలా తక్కువ చోట్లల్లో మాత్రమే వర్షాలున్నాయి, తప్ప విస్తారంగా వర్షాలు ఉండవని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -