Breaking News Live Telugu Updates: మేడిగడ్డ బ్యారేజ్ లో మహారాష్ట్ర వాసి గల్లంతు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 24 Nov 2022 09:09 PM
Warangal: క్షణికావేశంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం, భార్యభర్తలు మృతి

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భార్యభర్తలు మృతి చెందగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ నగరంలోని గిర్మాజిపేట్ బొడ్రాయికి చెందిన నవధాన్ (33), స్రవంతి (28) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు. నవధన్ గోల్డ్ స్మిత్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా గురువారం భార్యాభర్తలు నవధాన్, స్రవంతి, పెద్ద కొడుకు విషం తాగారు. దీంతో నవధాన్, స్రవంతి మృతి చెందగా.. పెద్ద కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని వరంగల్ ఎంజీఎం‌కు తరలించారు.

Anakapally District: అనకాపల్లి జిల్లాలో తప్పిన పెను ప్రమాదం

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై స్కూల్ బస్సును లారీ వెనక నుంచి ఢీకొన్న ప్రమాద సమయంలో బస్సులో 60 మంది చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బ్రేక్ ఫైల్ అవ్వటం వల్లనే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

Telangana Assembly: డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రులకు సీఎం ఆదేశాలు

అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది. ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Telangana Assembly: డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబరు నెలలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రధానంగా ఈ సమావేశాలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సాగనున్నాయి. అసెంబ్లీ వేదికగా కేంద్రం తీరును తప్పుబట్టాలని నిర్ణయించారు.

మేడిగడ్డ బ్యారేజ్ లో మహారాష్ట్ర వాసి గల్లంతు 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటి పెళ్లిలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మహారాష్ట్రలోని అంకిసా గ్రామానికి చెందిన ముగ్గురు ప్రమాదానికి గురైయ్యారు. గగ్గూరి మధుకర్(27), చౌల సమ్మయ్య(21) తోట సమ్మయ్య(21) ముగ్గురు వ్యక్తులు మేడిగడ్డ బ్యారేజ్ లో పడపోయారు. చేపల వేటకు పడవతో బ్యారేజీ గేట్ల దగ్గరలో వలవేసి చేపలు పడుతుండగా  ప్రమాదవశాత్తు వరద పోటు ఎక్కువయినట్టు సమాచారం. వల పట్టుకుని గగ్గూరి మధుకర్, చోళ సమ్మయ్య ఇద్దరూ బయటికి రాగా తోట సమ్మయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని కొరకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.  

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు 

 ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుల కస్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టు కొట్టి వేసింది.  గతంలో రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు... మరోసారి కస్టడికి ఇవ్వలేమని తేల్చిచెప్పింది.  పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. 

వైసీపీ ఎంపీ తలారి రంగయ్యకు అస్వస్థత 

MP Talari Rangaiah : అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కు అస్వస్థత గురయ్యారు.  అనంతపురం నగరంలోని పావని హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. స్వల్ప గుండెపోటుగా వైద్యులు నిర్ధారించారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్  తీసుకుని ఎంపీ ఇంటికి చేరుకున్నారు. కార్యకర్తలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని ఎంపీ కోరారు. 

ఇప్పటం కేసులో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం, రూ.లక్ష చొప్పున జరిమానా! 

Ippatam Case : ఇప్పటం గ్రామంలో ఆక్రమణ తొలగింపు కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులు ఇచ్చినా తమకు అందలేదని కోర్టును తప్పుదోవపట్టించారని పిటిషనర్లకు ఫైన్ విధించింది కోర్టు. 14 మంది పిటిషనర్లకు రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించింది.  

రామోజీ ఫిలిం సిటీ స్థలంలో సీపీఎం నిరసన

Rangareddy News : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి , నగన్ పల్లి పరిధిలో రామోజీ ఫిలిం సిటీలో ఉన్న సర్వే నెంబర్ 189,203లో ప్రభుత్వ భూములను పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర  నిర్వహించారు. ఫిలిం సిటీ  భూములలో ఎర్రజెండాలు పాతి సీపీఎం నాయకులు, పేద ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. గతంలో దాదాపు 700 మందికి  పట్టాలు ఇచ్చినప్పటికీ పొజిషన్ ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పొజిషన్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ పార్టీ నాయకులు, లబ్ధిదారులు నిరసన చేపట్టారు. రామోజీ ఫిలిం సిటీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీయాలంటూ నినాదాలు చేశారు. దాంతో అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

నెల్లూరు కోర్టులో చోరీ కేసు సీబీఐకి అప్పగింత 

Nellore News : నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనలో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టులో సాక్ష్యాల చోరీని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు సీజే జస్టిస్‌ పి.కె.మిశ్రా  ఆదేశాలు జారీచేశారు. నెల్లూరు నాలుగో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో దొంగలు పడి ఓ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు దోచుకెళ్లారు. ఆ కేసు పత్రాల్లో కొన్నింటిని కాలువలో పడేశారు. 

Background

రానున్న 48 గంటల్లో ఉత్తర అండమాన్‌కు ఆనుకొని తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటికల్లా దీనిపై క్లారిటీ వస్తుందని పేర్కొంది. మరోవైపు నిన్నటి వరకు కొనసాగిన అల్పపీడనం పూర్తిగా బలహీన పడింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతంలో వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. తమిళనాడులో కూడా వానలు పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దానికి ఆనుకొని ఉన్న పొరుగు ప్రాంతాలపై ఉంది. బుధవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్: తడ (నెల్లూరుజిల్లా) 9సెం.మీ.: సూళ్లూరుపేట (నెల్లూరు జిల్లా ) 9సెం.మీ.; రాయలసీమ: సత్యవేడు (చిత్తూరు జిల్లా) 9సెం.మీ. అల్పపీడన ప్రభావంతో మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4゚C కంటే తక్కువగా నమోదు కానున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఒడిశాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3-5⁰ C తగ్గే అవకాశం ఉంది. 


తెలంగాణలో వాతావరణం


తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంమటుంది. హైదరాబాద్‌లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీల మధ్య ఉండే ఛాన్స్ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు, గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీయొచ్చు. తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి  వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్‌ 24, 25, 26 తేదీల్లో ఈ పరిస్థితి కనిపిస్తుందని అధికారులు ప్రకటించారు. 


మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు


 మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయమై మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే తమ అధికారిని మంత్రి బంధించారని ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. అలాగే తాము సేకరించిన డాక్యుమెంట్లను మంత్రి మల్లారెడ్డి చించి పడేశారని, తమ ల్యాప్ టాప్ ను కూడా బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐటీ అధికారులు తమపై దాడి చేసి బలవంతంగా తప్పుడు లెక్కలతో తమ సంతకం తీసుకున్నారని మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కూడా కొట్టినట్లు చెబుతున్నారు. ఐటీ శాఖ అధికారులు చేసిన ఫిర్యాదును దుండిగల్ పోలీస్ స్టేషన్ కు అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. మరోవైపు మల్లారెడ్డికి చెందిన ఆఫీస్‌లు, ఇళ్లలు, బంధువులు, రక్తసంబంధీకుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు ముగిశాయి. తనిఖీల్లో దొరికిన నగదు, ఇతర ఆస్తులపై వివరణ ఇచ్చేందుకు ఐటీ కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చింది. మంత్రి మల్లారెడ్డితోపాటు ఇద్దరు కుమారులు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మా రెడ్డికి ఐటీ శాఖ నోటీసులు అందజేసింది. సోమవారం ఐటీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.