Breaking News Live Telugu Updates: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరో నోటీసు, రేపు విచారణకు రావాలని!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు నేటి మధ్యాహ్నం 3.45 గంటలకు వాయిదా వేసింది. తనను అరెస్ట్ చేయరంటేనే ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారని ఆయన తరుపు లాయర్లు చెబుతున్నారు.
అనంతపురం జిల్లా దేవరకొండలో విషాదం చోటు చేసుకుంది. శ్రీవిద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ ఉమాపతి మృతి సంచలనంగా మారింది. ఆయన తన కారు డ్రైవర్ ను దించేసి.. స్వయంగా కారు నడుపుతూ కొండ కిందికి దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అప్పుల బాధతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థ నటుడు మోహన్ బాబుకు చెందిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం (ఏప్రిల్ 19) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీకాకుళం పర్యటనలో మూలపేట పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఈ కార్యక్రమం జరగనుంది.
తెలంగాణ ప్రజలకు వైఎస్ఆర్ సీపీ నేతలు క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ నేతలు, మంత్రులు హద్దులు మీరి ప్రవర్తించారని అన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు. హరీశ్ రావుకు సమాధానం చెప్పకుండా తెలంగాణ ప్రజలను కూడా వైఎస్ఆర్ సీపీ నేతలు తిట్టడం సరికాదని అన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన ఓ సందేశాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Background
నిన్న ఒడిశా నుండి ఉన్న ద్రోణి/ గాలిలోని అనిచ్చితి, ఈ రోజు దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి ఇంటీరియర్ కర్ణాటక మీదగా తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన కొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC మరియు చుట్టు ప్రక్కల జిల్లాలలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 49 శాతం నమోదైంది.
ఏపీలో ఎండలు ఇలా
ఏపీలో ఎండలు విపరీతం అయ్యాయి. నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వెదర్ బులెటిన్ లో తెలిపారు.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీఅల్లూరి సీతారామరాజు, కాకినాడ, పశ్చిమ గోదావరి, క్రిష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది. అందుకని, ప్రజలు ఇంటిపట్టునే ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు సూచించారు. బిగుతైన దుస్తులు ధరించవద్దని, వదులుగా తేలిగ్గా ఉండే లేత రంగుల బట్టలు ధరించాలని సూచించారు. బయటకు వెళ్లిన పక్షంలో టోపీ, గొడుగు వాడాలని సూచించారు.
ఢిల్లీలో విపరీతమైన ఎండలు
దేశ రాజధాని ఢిల్లీలో ఎండ వేడిమికి జనం అవస్థలు పడ్డారు. బలమైన తీక్షణమైన ఎండ ఉదయం నుంచే ప్రారంభం అవుతోంది. ఎండ తీవ్రతతో పగటిపూట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుని వేడితో పాటు, రాబోయే కొద్ది రోజులలో వేడి గాలులు అంటే హీట్ వేవ్ గురించి హెచ్చరిక జారీ అయింది. ఆదివారం (ఏప్రిల్ 16) కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
వాతావరణ విభాగం అంచనాల ప్రకారం.. ఢిల్లీ, హరియాణా, పంజాబ్ సహా ఉత్తర భారతదేశంలో రాబోయే రోజులు ప్రజలకు చాలా కష్టంగా మారనుంది. ఉష్ణోగ్రతలో మరింత పెరుగుదల కనిపిస్తుంది. భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటినపుడు హీట్‌వేవ్ ప్రకటిస్తారు.
ఈ ఏడాది తొలిసారిగా 40కి పైగా ఉష్ణోగ్రత
వడగాలులు వీచే అవకాశం ఉన్నందున పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసినట్లు వాతావరణ శాఖకు చెందిన నరేష్ కుమార్ తెలిపారు. వెస్ట్రర్న్ డిస్ట్రబెన్స్ కారణంగా, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత కాస్త పడిపోవచ్చు. వచ్చే వారం వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది తొలిసారిగా ఢిల్లీలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
- - - - - - - - - Advertisement - - - - - - - - -