Breaking News Live Telugu Updates: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 11 Jul 2022 02:57 PM
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు

ఎన్డీయేౌొ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ముర్ముకు మద్దతు ప్రకటించారు. 

Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రలో ఏపీ మహిళ మృతి

ఏపీలోని రాజమండ్రికి చెందిన మహిళ అమర్‌నాథ్‌ యాత్రలో చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన వారిలో ఐదుగురు భక్తుల ఆచూకీ తెలియడం లేదని ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు నిన్న ప్రకటించారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా ఉండగా, గుడిమెట్ల సుధ, పార్వతి జాడ తెలియాల్సి ఉండగా ఇవాళ గుడిమెట్ల సుధ మృతదేహాన్ని భర్త విజయ్‌ కిరణ్‌ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పార్వతి ఆచూకీ తెలియాల్సి ఉంది.

Rains in Telangana: భద్రాచలం వద్ద 50 అడుగులు దాటిన నీటి మట్టం

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి పలు ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.4 అడుగులకు చేరుకుంది. మరికొన్ని గంటల్లోనే 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏ క్షణంలోనైనా అధికారులు మూడో (చివరి) ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ముఖ్యంగా నేటి ఉదయం నుంచి వరద ప్రవాహం పెరిగిపోతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 12,79,307 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో గోదావరి నదిలో అక్కడి స్నానఘట్టాలు మునిగిపోయాయి. దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

MLA Payyavula Kesav: పయ్యావుల కేశవ్ భద్రత కొనసాగిస్తున్నాం - అనంతపురం పోలీసులు

  • అనంతపురం: ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ భద్రతలో భాగంగా 1+1 గన్ మేన్లను కొనసాగిస్తున్నాం

  • గన్ మేన్లను ఉపసంహరిస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. 

  • ఆయనకు ప్రస్తుతమున్న భద్రతను అలానే కొనసాగిస్తాం - జిల్లా పోలీసు కార్యాలయం, అనంతపురం

Bandi Sanjay: బండి సంజయ్ కు అమిత్ షా, జేపీ నడ్డా ఫోన్, పుట్టిన రోజు శుభాకాంక్షలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా బండి సంజయ్ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పార్టీ జాతీయ నేతలతోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు బండి సంజయ్ కు ఫోన్, ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి చెందిన కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

Nellore News: భర్తను హత్య చేసిన భార్య - అందుకు కొడుకు, మామ సాయం!

నెల్లూరు జిల్లా కావ‌లిలో దారుణ హ‌త్య జరిగింది. ఓ భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఇంట్లో గొడవల కారణంగా మాల్యాద్రి అనే తన భర్తను రొక‌లి బండ‌తో తలపై మోది భార్య పద్మ క‌త్తితో పొడిచింది. మాల్యాద్రి ప‌ద్మ ఇద్దరూ రోజూ గొడ‌వ‌ ప‌డేవాడుతుండేవారని స్థానికులు వెల్లడించారు. భార్యకు హత్య చేసేందుకు కొడుకు మ‌ధ‌న్, మామ శేష‌య్య స‌హ‌క‌రించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Background

ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతోంది. దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఏపీలో 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా తెలంగాణలో 3 రోజులపాటు రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం వాయువ్య, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిషా, ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉన్నది. దీని ప్రభావంతో ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. 


మరో రెండు నుంచి మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం, ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. తూర్పు - పశ్చిమ గాలుల కోత దాదాపు ఉత్తర భారత ద్వీపకల్పమైన 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ వరకు విస్తరించి ఎత్తు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుందని వెల్లడించింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర , యానాంలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు వర్షాలు కురనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నందున ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకూ చినకు లేని జిల్లాల్లోనూ వర్షాలు మొదలయ్యాయి.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేటి నుంచి 2 రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాటితో పాటు రాయలసీమలో ఒకంట్రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జూలై 13 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి 9 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు. 
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్,  జనగామ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ కేంద్రం ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.


మూడు రోజులు విద్యాసంస్థలు బంద్
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున సోమ, మంగళ, బుధవారాలు మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మూడు రోజులు సెలవులు ప్రకటించారు అధికారులు.  రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.