Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
15 ఆగస్టు నుంచి తెలంగాణలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని యోచిస్తోంది. అంటే మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల మందికి పింఛన్ అందివ్వనున్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేసింది మంత్రిమండలి. కోఠి ఈఎన్.టి. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్.టి.టవర్ నిర్మించాలని కూడా సమావేశంలో డెసిషన్ తీసుకుంది. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5111 అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయనుంది.
స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేసింది తెలంగాణ క్యాబినెట్. ఈనెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల ఈ ప్రత్యేక సమావేశాలు రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయించారు.
జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీని క్యాబినెట్ ఆదేశించింది. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ వేసి... 15 రోజుల్లోగా నివేదిక తీసుకొని శాశ్వత పరిష్కరానికి ప్రణాళికలు వేసింది.
వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలాన్ని కేటాయించింది. షాబాద్‌లో షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి 45 ఎకరాలు కేటాయించింది.
ఉత్తర్‌ప్రదేశ్ ఘోర పడవ ప్రమాదం జరిగింది. బాందా వద్ద నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవలో యాభై మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటికి నలుగురు మృతదేహాలను వెలికి తీశారు.
Basara IIIT : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలోని హాస్టల్ లో పెచ్చులూడి పడి విద్యార్థికి గాయాలయ్యాయి. పీయూసీ వన్ చదువుతున్న దీమాత్ అనే విద్యార్థి తలపై పెచ్చులూడి పడ్డాయి. విద్యార్థికి తలపై గాయమవ్వడంతో అతడిని నిజామాబాద్ జిల్లా నవీపేట్ ఆస్పత్రికి తరలించారు.
TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, నిధుల కేటాయింపుపై చర్చించనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు వచ్చిన సమయంలో విజయమ్మ ఉన్న కారు టైరు పేలింది. దీంతో వాహనం అదుపుతప్పింది. అయితే, విజయమ్మకు ఏ గాయాలు కాలేదు. ఫంక్షన్ లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో వేరే కారులో విజయమ్మ వెళ్లిపోయారు.
హైదరాబాద్‌లో మునుగోడు ఉప ఎన్నిక పై గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ సెక్రటరీలు బోస్ రాజు, నదీమ్ జావిద్, చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ , భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్, ఈరవత్రి అనీల్ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం పైన నాయకులు చర్చిస్తున్నారు.
- నేటితో 9వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర"
- ఉదయం 10 గంటలకు సిరిపురం నుంచి ప్రారంభం అయిన బండి సంజయ్ పాదయాత్ర
- ఆజాదీ కా అమృత మహాత్సవంలో భాగంగా పాదయాత్ర శిబిరం వద్ద స్వతంత్ర సమర యోధుడు బత్తిని మొగలయ్య గౌడ్ కు నివాళులు అర్పించనున్న బండి సంజయ్ కుమార్
- అనంతరం సిరిపురం నుంచి రామన్నపేట, దుబ్బాక మీదుగా మునిపంపుల వరకు కొనసాగనున్న పాదయాత్ర
- ఇవాళ రాత్రికి మునిపంపుల సమీపంలో బండి సంజయ్ రాత్రి బస
- నేడు 12.5 కిలో మీటర్ల మేర కొనసాగనున్న పాదయాత్ర
- రామన్నపేట వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్
- పాదయాత్రలో భాగంగా వివిధ ప్రజలతో మమేకం కానున్న బండి సంజయ్
Har Ghar Tiranga కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం నగరంలోని ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. జాతీయ జెండాలతో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పలువురు బీజేపీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్సార్ నగర్, పంజాగుట్ట, కేర్ హాస్పిటల్, సచివాలయం, లిబర్టీ, హిమాయత్ నగర్, శంకర్ మట్, అడిక్‌మెట్, మాణికేశ్వర్ నగర్, ఇఫ్లూ, చిలకలగూడ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ర్యాలీ ముగియనుంది.
పార్టీ మారుతున్నారంటూ కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అలాంటి దుష్ప్రచారాన్ని కోవూరు ప్రజలు నమ్మొద్దని చెప్పారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయపాలెంలో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తాను జీవితాంతం జగన్ తోనే ఉంటానని చెప్పారు. అసలు చంద్రబాబుని తాను తిట్టినంతగా ఇంకెవరూ తిట్టలేదని గుర్తు చేశారు ప్రసన్న. తనకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో పార్టీ మారుతున్నానంటూ లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కానీ మిగతా నియోజకవర్గాల్లో లాగా తన నియోజకవర్గంలో మంత్రి పదవి రానుందుకు జగన్ దిష్టిబొమ్మలు తగలబెట్టలేదని, అసలు నిరసన కార్యక్రమాలు కూడా చేయలేదని చెప్పారు.
రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ నివాసంలో సీఎం వైఎస్ జగన్‌కు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు. వీరితో పాటు హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమీషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ కూడా రాఖీలు కట్టారు.
Background
ఏపీ, తెలంగాణకు వర్షాల సూచన మరికొద్ది రోజులు ఉండనున్నట్లుగా వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలావుంటే ఈ నెల 13వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఆ తర్వాత 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని ప్రభావంతో 14న మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
హైదరాబాద్ వాతావరణం ఇలా..
హైదరాబాద్‌లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశల నుంచి గాలులు (గాలి వేగం గంటకు 14 నుంచి 20 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది.
AP Weather: ఏపీలో వాతావరణం
రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర కు భారీ వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 48 గంటల పాటు కోస్తాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది. భారీ ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ శాఖ పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తీరం వెంబడి 45 నుంచి 55 కిలో మీటర్లు లేదా కొన్ని చోట్ల 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు.
ఉత్తర కోస్తాఆంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల సంభవించే అవకాశం ఉంది.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు భారీగా తగ్గింది. వెండి ధర కూడా నేడు బాగానే తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.600 తగ్గి రూ.47,350 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,650 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.64,200 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,200 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,350 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,650 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,200 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -