Breaking News Live Telugu Updates: అమరావతి రైతుల పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు, డీజీపీ అనుబంధ పిటిషన్‌ను కూడా
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. మహా పాదయాత్ర విషయంలో గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను సవరించబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. తమ షరతులకు లోబడే పాదయాత్ర జరగాలని ఆదేశించింది. పాదయాత్రలో పాల్గొనకుండా సంఘీభావం తెలపవచ్చని సూచించింది. పాదయాత్ర రద్దు చేయాలని రాష్ట్ర డీజీపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
మరికొద్ది గంటల్లో ఉప ఎన్నికల ప్రచారం ముగియనుండగా మునుగోడులో ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ - బీజేపీ శ్రేణుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో ఈ ఘటన జరిగింది. కార్యకర్తలు కర్రలతో కొట్టుకుంటున్న క్రమంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆపేందుకు యత్నించిన పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి. ఈ ఘర్షణ వాతావరణంలో కొంత మంది బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పైన దాడి చేశారు.
తెలంగాణలో తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తమ నేతల ఫోన్లను రహస్యంగా వింటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే, నగదు లావాదేవీలు, ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాలు కూడా టీఆర్ఎస్ కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు.
నెల్లూరులో వర్షాల బీభత్సం నెలకొంది. నెల్లూరు నగరంలో చిన్నపాటి జల్లులు పడినా అండర్ బ్రిడ్జ్ ల వద్ద నీరు నిలబడుతుంది. అలాంటిది అర్థరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో అండర్ బ్రిల్డ్ లు ఇలా తయారయ్యాయి. ప్రజలు అటు నుంచి ఇటు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెల్లూరు నగరం మధ్యనుంచి రైల్వే ట్రాక్ వెళ్తుంది ప్రజలు అటు, ఇటు వెళ్లాలంటే అండర్ బ్రిడ్జ్ ప్రయాణాలు తప్పనిసరి. మూడు చోట్ల ఇలాంటి బ్రిడ్జ్ లు ఉన్నాయి. అయితే వర్షాలకు ఇక్కడ వెంటనే నీరు చేరుతుంది. ప్రజల ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు తాజాగా అండర్ బ్రిడ్జ్ లు ఇలా నీటితో నిండిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియ పునఃప్రారంభించింది టిటిడి. దర్శన టోకన్ల కోసం భక్తులు అర్దరాత్రి నుండే పెద్ద ఎత్తున కౌంటర్ల దగ్గర బారులు తీరారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేస్తోంది టిటిడి. టోకెన్ లభించిన భక్తుడు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేసింది. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తుంది. అయితే నిర్దేశిత కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేయనుంది టిటిడి. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామి వారిని దర్శించుకునే సదుపాయంను టిటిడి అధికారులు కల్పించారు. టోకెన్ల జారీ ప్రక్రియలో ఎదురయ్యే లోటు పాట్లను సరిదిద్దుకుంటూ క్రమంగా టోకెన్ల సంఖ్యను పెంచే విధంగా టిటిడి చర్యలు తీసుకుంది. ఆధార్ నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్ పొందే అవకాశం ఉంటుంది. తిరుమలలో వసతికి సంబంధించి ఒత్తిడి తగ్గించడం కోసం డిసెంబర్ 1వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేయనుంది. అక్కడే గదులు కేటాయించనుంది టిటిడి.
Background
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా, వాతావరణ కేంద్రం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. 2015 లో నెల్లూరు జిల్లాలో నవంబర్ నెలలో ఒకే రోజులో 200 - 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈసారి అటు ఇటూ అలాంటి వర్షాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు, తిరుపతి జిల్లా ప్రజలను హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేటి నాలుగు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలున్నాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లో అల్పపీడనం ప్రభావం చూపనుంది. ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండటం వలన వర్ష తీవ్రత కోస్తాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉంటుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరంలో ఉండటంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో నవంబర్ 1 నుంచి నాలుగు రోజులపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనంతో పాటు వస్తున్న ఉపరితల ఆవర్తనం కాస్త ఆలస్యంగా రావడం వలన రాత్రివేళ అధికంగా కురవనున్నాయి. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో తేలికపాటి వర్షాలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలున్నాయి. నవంబర్ 2, నవంబర్ 3న వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తక్కువ వర్షాలున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం నవంబర్ 2, 3 తేదీలలో చలి గాలులు వీచనున్నాయి. తెలంగాణ - ఆంధ్ర సరిహద్దు భాగాల్లో మాత్రం నవంబర్ 2, 3 తేదీల్లో చినుకులు ఉండే అవకాశాలున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. ఏడేళ్ల తరువాత ఆ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కానుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. కోస్తా ప్రాంతాలకి ఆనుకొని ఉండే భాగాలు ముఖ్యంగా నెల్లూరు, సూళూరుపేట, కృష్ణపట్నం, చెన్నైకి దగ్గర ఉన్న ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలున్నాయి. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లోనూ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 3, 4 తేదీలలో సాధారణ వర్షాలున్నాయి.
ప్రకాశం, అన్నమయ్య జిల్లా, కడప, చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాల్లో, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. చిట్వేల్, ఒంగోలు, కందుకూరు, బద్వేల్, మచిలీపట్నం, అమలాపురం, నర్సాపురం లాంటి ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణం ఉంటుంది. నవంబర్ 1 నుంచి నవంబర్ 4 వరకు వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో రాత్రిపూట చలి తీవ్రత పెరుగుతోంది. అల్పపీడనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నవంబర్ తొలి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ లో ఆకాశాన్ని పాక్షికంగా మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -