Breaking News on 24 September: బీసీ కార్పొరేషన్ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయశాఖ పరిధి నుంచి ఏపీ ప్రభుత్వం తప్పించింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాల్మియా కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే గురువారం విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్‌ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 247 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,64,411కు చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ కారణంగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,909కి చేరింది. నిన్న ఒక్కరోజే కోవిడ్ బాధితుల్లో 315 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 6,55,625కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక శుక్రవారం జరగనుంది. శుక్రవారం ఉదయం 10 గంటల్లోగా నామినేషన్ల స్వీకరిస్తారు. ఉదయం 10 నుంచి 12 వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మధ్యాహ్నం 12 గం.కు నామినేషన్లు వేసిన వారి జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కోఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక, ప్రమాణస్వీకారం ఉంటుంది. మధ్యాహ్నం 3 నుంచి ఎంపీపీ, ఉపాధ్యక్షుడి ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. తొలి దశలో త్వరలో 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయింది. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో చేపట్టబోయే ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు జారీచేసింది. రూ. 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టనున్నారు. 1.65 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా రూ.1,774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. సంగమేశ్వర ఈ పథకం ద్వారా సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు ప్రయోజనం కలుగనుంది.
సికింద్రాబాద్ తాడ్‌బండ్ కూడలి వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేక్ ఫెయిలై కార్లపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బోయిన్‌పల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
దేశంలో మరో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ఠాణెలో ఓ బాలికపై 29 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర ఠాణెలోని దోంబివల్లిలోని భోపర్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై 29 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 21 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు.
రేపు (శుక్రవారం ) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి శాసన సభా సమావేశాల ప్రారంభ కార్యక్రమం, అనంతరం జరిగే బీఏసీ సమావేశం పాల్గొంటారు. తర్వాత సీఎం కేసీఆర్ దిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 25న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షకావత్ తో సమావేశమౌతారు. 26వ తేదీన విజ్జానభవన్ లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.
బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో పెద్ద ఎత్తున నిల్వ ఉన్న బాణా సంచా పేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. పేలుడు ధాటికి వారి శరీరాలు తునాతునకలు అయ్యాయి. మరికొందరికి గాయాలయ్యాయి. బెంగళూరులోని చామరాజు పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల కోసం గురువారం ఉదయం మంచు విష్ణు తన ప్యానల్‌ని ప్రకటించారు. తన ప్యానల్ నుంచి ఎవరెవరు.. ఏ ఏ పదవుల కోసం పోటీ చేస్తున్నారనే విషయాలను ఆయన వివరించారు.
బంగాల్లోని ఉత్తర దినాజ్‌పుర్‌లో చెరువులోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులతో ఝార్ఖండ్ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న బస్సు రాయిగంజ్లోని 34వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 10.45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. తొలుత స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించి.. అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 25న ఆయన పర్యటన ఉండనుంది. ఢిల్లీలో 26న ఆయన హోం మంత్రి అమిత్ షాను కలవనున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో హోంమంత్రి నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది.
జమ్ము కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లుగా రక్షణశాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. జమ్ము కశ్మీర్ పోలీసులు, భారత ఆర్మీ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదిని మట్టుబెట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. లక్కారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. బస్సు-టిప్పర్ ఢీకొన్న ప్రమాదం వల్ల విజయవాడ-హైదరాబాద్ రహదారిపై 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -