Breaking News:ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్... పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు..!

Breaking News: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 07 Nov 2021 02:49 PM
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్... పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు 

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో పల్లెవెలుగు బస్సులకు కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు ఆపై సర్వీసులకు 30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్‌ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది. 

మంత్రి తల్లికి సీఎం కేసీఆర్ నివాళులు

ఇటీవల చనిపోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం ఆమె దశదిన కర్మ. ఈ సందర్భంగా సీఎం హాజరయ్యారు. మహబూబ్‌ నగర్ జిల్లా భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి సీఎం చేరుకొని ఆమె సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని తదితరులు ఉన్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి శాంతమ్మ అక్టోబర్‌ 29న హైదరాబాద్‌లో కన్నుమూశారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సమీక్ష ప్రారంభం

తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. బస్సు ఛార్జీల పెంపుపై సమీక్షలో అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఢిల్లీలో మొదలైంది. ఈ భేటీలో ప్రధానంగా వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు జరుపుతున్నారు. అలాగే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి బీజేపీ నేతలు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి వర్చువల్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్, ఈటల రాజేందర్, రాజాసింగ్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి ఈ సమావేశంలో పాల్గొన్నారు. డీకే అరుణ, లక్ష్మణ్, మురళీధరరావులు ఢిల్లీలో ఈ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు.

కుల గణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తాం.. ప్రముఖ సినీ నటుడు సుమన్

కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని బీసీ నేత, ప్రముఖ సినీ నటుడు సుమన్ స్పష్టం చేశారు. కుల గణనను చేపట్టాలని కోరుతూ ఆదివారం చిత్తూరు నుంచి కాణిపాకం వరకు పాదయాత్ర చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒకపక్క జోరువాన కురుస్తున్నా యాత్రను జయప్రదం చేశారు. కుల గణన పై ఆరు రాష్ట్రాలు తీర్మానం చేశాయని, 20 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి అని సుమన్ పేర్కొన్నారు. వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి బీసీల హక్కులపై తెలియజేయాలని పేర్కొన్నారు. 

వైఎస్సార్‌సీపీ ఇరువర్గాల సభ్యులు ఓ వర్గంపై మరో వర్గీయుల దాడి

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని గూడూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ఇరువర్గాల సభ్యులు ఒకరిపై మరొకరు దాడికి యత్నించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజాసంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద నేతలు తమ వర్గీయులకు సర్దిచెబుతున్నారని సమాచారం.

భూపాలపల్లి జాతీయ రహాదారిపై  రోడ్డు ప్రమాదం.. పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ

భూపాలపల్లి జాతీయ రహాదారిపై  రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇసుక లారీ ఢీకొట్టడంతో రేగొండ పీఎస్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం నుజ్జునుజ్జు అయింది. పెట్రోలింగ్ వాహనంలో ఉన్న ఏఎస్సై పోరిక లాల్, డ్రైవర్ అశోక్ కు తీవ్ర గాయాలు.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.  ఆదివారం తెల్లవారుజామున రేగొండ మండలం మైలారం సమీపంలో ఘటన జరిగింది.

పేకాట శిబిరంపై దాడులు

హైదరాబాద్‌లో మరో పేకాట గుట్టు బయటపడింది. కాప్రా సర్కిల్ పరిధిలోని సైనిక్ పురిలోని జీఎస్ఎన్ అపార్ట్‎మెంట్స్‌లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసుల దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 10 మంది అరెస్టు చేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల నుంచి సుమారుగా రూ.65,790 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మహబూబ్ నగర్‌లో పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ నేడు మహబూబ్‌నగర్‌‌లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ నేత, రాష్ట్ర మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి శాంతమ్మ దశదిన కర్మలో సీఎం ఆదివారం ఉదయం పాల్గొంటారు. భూత్పూర్‌ రోడ్డులోని శాంతమ్మ సమాధి వద్ద సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు.

తాడిపత్రిలో పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

అనంతపురం జిల్లాలో నేటి ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి చుక్కలురు రోడ్డు పెట్రోల్ బంకు వద్ద 20 మంది కూలీలతో వెళ్తున్న బొలెరో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు అక్కనపల్లె గ్రామానికి చెందిన కూలీలు అని సమాచారం.

Background

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు బాగా ఎగబాకింది. ఏకంగా గ్రాముకు రూ.40 చొప్పున పెరిగింది. మరోవైపు, వెండి ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలోకు రూ.100 వరకూ వెండి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,700గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర రూ.100 పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 


హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా ముందు రోజుతో పోల్చితే నిలకడగానే ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.19 పైసలు పెరిగింది. దీంతో తాజా ధర రూ.107.88 అయింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.63 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.110.98 గా ఉంది. డీజిల్ ధర రూ.0.56 పైసలు పెరిగి రూ.97.00కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.05గా ఉంది. పాత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.27 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.18గా ఉంది. ఇది లీటరుకు రూ.0.25 చొప్పున తగ్గింది.


అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో విషాద ఘటన శనివారం జరిగింది. కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి(56) జిల్లాలోని పామిడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటస్వామికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు గోవర్ధన్ వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు.


అనుకున్న ముహూర్తానికే వివాహం జరిపించారు. మూడు రోజుల కిందట వెంకటస్వామి తల్లి కొన్నమ్మ అస్వస్థతకు గురికావడంతో అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మనవడు గోవర్ధన్ వివాహం జరిగిన కొంత సమయానికే కొన్నమ్మ నిపోయింది. ఈ విషయాన్ని వెంకటస్వామి బంధువులు ఆయనకు ఫోన్ చేసి సమాచారం అందించారు. తల్లి చనిపోయిందన్న వార్త విని షాక్ కు గురైన ఏఎస్సై వెంకటస్వామి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.