Breaking News Live: భారత్‌ బయోటెక్‌ ఎండీకి పద్మభూషణ్‌, మొగులయ్య, గరికిపాటి నర్సింహారావుకు పద్మశ్రీ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 25 Jan 2022 08:38 PM
భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌కు పద్మభూషణ్‌, మొగులయ్య, గరికిపాటి నర్సింహారావుకు పద్మశ్రీ

పద్మభూషణ్ : కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా ( కోవాగ్జిన్,  భారత్ బయోటెక్ ) 


ఆంధ్రప్రదేశ్‌ నుంచి పద్శశ్రీ లు : గరికపాటి నర్సింహారావు, గోసవీడు షేక్ హుస్సేన్ , డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు


తెలంగాణ నుంచి పద్మశ్రీలు : దర్శనం మొగులయ్య , రామచంద్రయ్య

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా ఎస్.యం.పురం గ్రామం గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ఎస్ యం పురం గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పాఠశాలలో వంశీ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. టీచర్ కొట్టడం వలనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని వంశీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు..
 

నోటిఫికేషన్లు పడడంలేదని మరో నిరుద్యోగి ఆత్మహత్య...!

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ పడలేదని మనస్తాపంతో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మంలో మహబూబాద్ జిల్లా బయ్యారం చెందిన సాగర్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. 'ఇగ నోటిఫికేషన్లు పడవ్..పిచ్చి లేస్తుంది. కరోనా+కేసీఆర్ కారణం' అని వాట్సాప్ స్టేటస్ పెట్టి సాగర్ ఆత్మహత్య చేసుకున్నాడు.  
 

ఇచ్చాపురం మండలంలో ఏనులుగు హల్ చల్... ధాన్యం తినేశాయని రైతులు లబోదిబో 

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాలలో ఏనుగులు హల్ చల్ చేశాయి. వందలాది బస్తాల ధాన్యాన్ని పాడుచేశాయి. ఇచ్ఛాపురం మండలంలోని శివారు గ్రామమైన ముచ్చింద్ర గ్రామ పంటపొలాల్లో సోమవారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి.  సుమారు 100 బస్తాల ధాన్యాన్ని తినేశాయని రైతులు వాపోతున్నారు. .గ్రామానికి చెందిన రైతులు సాడి తులసమ్మ, బీర రాములమ్మ,చాట్ల బాలమ్లకు చెందిన ధాన్యం ఏనుగులు తినేశాయి. సుమారు లక్షా నలభై ఐదు వేల రూపాయల పంటను రైతులు నష్టపోయారు.
 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 138 కోట్ల వ్యయం తో చేపట్టే బాచుపల్లి రోడ్డు విస్తరణ మరియు ఫ్లై ఓవర్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఉద్యోగులకు మద్దతుగా సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ నేతల దీక్ష

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లకు మద్దతుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ఉదయం 11.00 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష ప్రారంభించారు. సోము వీర్రాజుతో పాటుగా ఎంపీలు సీఎం రమేష్, జీవీయల్ నరసింహారావు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్సీలు పీవీయన్ మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్థన్ రెడ్డి , సూర్యనారాయణ రాజు, బిట్ర వెంకట శివన్నారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్ మోగింది. వచ్చే నెల ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన ఉద్యోగులు నేటి నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నెల్లూరులో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు రోడ్లన్నీ ఉద్యోగులతో నిండిపోయాయి. బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టుకుని ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. మహిళా ఉద్యోగులు కూడా ముందుకు కదిలారు. పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కమిటీలన్నీ రద్దు... కొత్తగా కో-ఆర్డినేటర్లు నియామకం

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఇప్పటివరకు ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. వాటి స్థానంలో జిల్లాలకు కో-ఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది పార్టీ ఏర్పాటు అనంతరం పార్లమెంటు నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లు, రాష్ట్రస్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్‌ మీడియాతో పాటు పలు రకాల విభాగాలను ఏర్పాటు చేసి ఇన్‌ఛార్జులను నియమించారు. ప్రస్తుతం అన్ని కమిటీల రద్దు ప్రకటన పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. 

Background

ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలే అందుకు కారణమని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో వాయువ్య దిశ నుంచి గాలులు ఆగిపోగా.. తాజాగా నైరుతి దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అయితే వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు. తమిళనాడు, పుదుచ్చేరిలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు సైతం  తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య లేదని అధికారులు సూచించారు. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత వర్షాల కారణంగా పెరిగింది. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నంలో 19.4 డిగ్రీలు, విశాఖపట్నంలో 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గలేదు కానీ వర్షాల కారణంగా చలి గాలులు వీస్తున్నాయి.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో నేడు వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడతాయని అంచనా వేశారు. కోస్తాంధ్ర ప్రాంతంతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆరోగ్యవరంలో 16.5 డిగ్రీలు, అనంతపురంలో 16.8 డిగ్రీలు,  కర్నూలులో 18.7 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం సాధారణంగా, పొడిగా ఉంటుంది. తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశం నిర్మలమై కనిపిస్తుంది. ఉదయం వేళలో కొన్ని జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.