Breaking News Telugu Live Updates: ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే) కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 53 సంవత్సరాల వయసున్న కేకే కోల్‌కతాలో ఒక కాన్సర్ట్‌లో ప్రదర్శన ఇస్తూ హఠాత్తుగా కుప్పకూలారు. వెంటనే ఆయన్ను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
తొలిసారి కేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవరం నిర్వహిస్తున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ తెలంగాణ అవతరణ వేడుకలు నిర్వహించనున్నారు. వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి.
తిరుపతి : సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్ లో "పోవాలి జగన్, రావాలి పవన్" అనే నినాదంతో తిరుపతి జనసేన నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పరిపాలన ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమై, మూడేళ్ల కాలంలో ప్రజలను అష్టకష్టాలపాలు చేశారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో విఫలం చెందారని విమర్శించారు. మూడేళ్లు కావస్తున్నా ఇంత వరకు రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, వచ్చే ఎన్నికలలో పవన్ కు వందకు వంద శాతం ప్రజలు నీరాజనాలు పట్టే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. ఈ పోస్టర్ నినాదాన్ని రాష్ట్ర దేశవ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పటికే 2000 పైగా పోస్టర్లు ఇచ్చామన్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని, 3800 కోట్ల రూపాయలు రంగులకు ఖర్చు చేశారని, 139 సంస్థలు వెనక్కి వెళ్లాయని, మూడు సంవత్సరాల కాలంలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని,ఈ మూడేళ్ల పాలన పై ప్రజాభిప్రాయం సేకరించామని జగన్ పోవాలి పవన్ రావాలి అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు..
శ్రీశైలంలో 854 అడుగుల్లో నీరు నిల్వ ఉండాలి. సీడబ్ల్యూసీ ఆమోదించిన మేరకు ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ..
కృష్ణా జలాల్లో అదనపు వాటాను ట్రిబ్యునలే తేల్చాలి. కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీకి తేల్చిచెప్పిన ఏపీ ఈఎన్‌సీ. ఈ భేటీకి తెలంగాణ ప్రభుత్వం రెండోసారి గైర్హాజరు అయింది.
Rushikonda Excavations: విశాఖ రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ రాసిన లేఖపై విచారణ జరిపిన ఎన్జీటీ బెంచ్... తవ్వకాలపై మే 6న స్టే ఇచ్చింది. అయితే ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కనీసం నోటీసు ఇవ్వకుండా ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తమ పిటిషన్లో పేర్కొంది. వర్షాకాలం సమీపిస్తున్నందున స్టే ఎత్తివేయాలని ధర్మాసనాన్ని కోరగా, ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీం ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.
సికింద్రాబాద్ లో శబరి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ఆగంతుకుడు ఫోన్ చేయడంతో వెంటనే రైల్వే అధికారులు స్పందించి రైలులోని ప్రయాణికులను దింపేశారు. డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య టీమ్‌లు రైలులో తనిఖీలు మొదలుపెట్టాయి. శబరి ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్లనుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో దొంగతనం జరిగింది. దాదాపు రూ.46 లక్షలు విలువ గల ఒక నెక్లెస్ మాయం అయింది. 49 గ్రాముల బరువు ఉన్న ఓ డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డైమండ్ నెక్లెస్ మాయంపై కేవీపీ భార్య సునీత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న సునీత ఆ డైమండ్ నెక్లెస్ ధరించి ఓ ఫంక్షన్‌కు వెళ్ళారు. ఫంక్షన్ నుండి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం బెడ్ రూమ్‌లో నెక్లెస్‌ను పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నెక్లెస్ మాయమవడంతో సునీత అంతా వెతికారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ రెండు రోజుల క్రితం కేవీపీ భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి గుడివాడ అమరనాథ్ కు ప్రభుత్వం బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించాల్సి ఉండడంతో బులెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది.
ఏపీకి చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు డ్రగ్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. వీరు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో పోలీసులకు చిక్కారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లలమామిడాడకు చెందిన వట్టూరి సూర్యసంపంత్, రాజమహేంద్రవరంలోని మోరంపూడి సాయినగర్ కు చెందిన తీగల దీప్ ఫణీంద్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఈ డ్రగ్స్ దందాకు పాల్పడ్డారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న వీరు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ఆ క్రమంలోనే డ్రగ్స్ తీసుకెళ్తుండగా చౌటుప్పల్ వద్ద పోలీసులకు చిక్కారు. వీరి నుంచి రూ.2.35 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Background
నైరుతి రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ముందుగానే కేరళలో ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకతో పాటు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో గాలులు వేగంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల్లో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు అంటున్నారు. సాధారణం కంటే చాలా ముందుగానే అంటే మే 16వ తేదీనే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని తెలిపారు. ఏపీ, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాక ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవైపు వర్షాలు, మరోవైపు తీవ్రమైన ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో..
కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. యానాంలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరులతో పాటు రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వేగంగా గాలులు వీచడంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పొలం పనులు తాత్కాలికంగా విరమించుకోవడం ఉత్తమమని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో వైపున తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడతారు. రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి 10 నుంచి 20 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షం పడే అవకాశం లేదు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -