AP Telangana Breaking: ఏపీలో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లకు జైలు శిక్ష.. రూ.లక్ష జరిమానా వేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్‌డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 02 Sep 2021 01:32 PM
ముగ్గురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష

ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. అంతేకాక, రూ.లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. ఐఏఎస్‌లు రావత్, ముత్యాలరాజు, శేషగిరి రావు విషయంలో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ జైలు శిక్షపై అప్పీల్‌కు వెళ్లేందుకు నెల రోజుల పాటు అవకాశం విధించింది. భూ వ్యవహారంలో నష్ట పరిహారం చెల్లించలేదని సీరియస్ అయిన హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. బాధిత మహిళకు అధికారులు రూ.లక్ష సొంత డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి వాదుల వాదనతో శిక్షను నాలుగు వారాలపాటు నిలుపుదల చేసింది.

టీఆర్ఎస్ భవన్‌కు కేసీఆర్ శంకుస్థాపన

ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వసంత్ విహార్ ప్రాంతంలో 1300 గజాల స్థలంలో టీఆర్ఎస్ భవన్‌ను జీ+3 గా నిర్మించనున్నారు. ఈ పూజాకార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపన కార్యక్రమం

ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించబోయే తెలంగాణ భవన్‌‌కు మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.


ఈడీ ఎదుట ఛార్మి హాజరు

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. గురువారం ఈడీ ఎదుట విచారణకు నటి ఛార్మి హాజరయ్యారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మికి కూడా గతంలో పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2015-2017 మధ్యలో జరిగిన బ్యాంకు లావాదేవీలను తెలపాలని ఈడీ కోరింది. అంతేకాక, ఛార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు.

టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేసిన హరీశ్ రావు

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో 4వ మున్సిపల్ వార్డులో గురువారం టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగలో పాల్గొని మంత్రి హరీశ్ రావు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పట్టణంలోని 23వ వార్డు నాయకం లక్ష్మణ్, 24వ మున్సిపల్ వార్డు చైర్మన్ మంజుల రాజనర్సు వార్డులో టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి హరీశ్ రావు ఎగరవేశారు. పట్టణంలోని 25వ గుండ్ల యోగేశ్వర్ మున్సిపల్ వార్డు, 6వ మున్సిపల్ కౌన్సిలర్ వడ్లకొండ సాయి వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు.

మతోన్మాదం పెంచేలా బండి సంజయ్ వ్యాఖ్యలు: గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండలోని తన నివాసంలో శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తుండడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు. బీజేపీ పార్టీ అడ్డగోలుగా ధరలను పెంచుతూ ప్రజలను పీడించుకు తింటుందని ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ మతోన్మాదం పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ దేశ ద్రోహిలా మాట్లాడుతున్నారని.. అది సమంజసం కాదని కొట్టిపారేశారు.

జగన్ పక్కనే కూర్చున్న షర్మిల

వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన సందర్భంగా సీఎం జగన్ పక్కనే షర్మిల కూర్చున్నారు. ఆమె తెలంగాణ పార్టీ పెట్టిన నాటి నుంచి సోదరుడితో కాస్త దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కృష్ణా నీటి పంచాయితీ విషయంపై సీఎం కేసీఆర్‌ను విమర్శించిన సందర్భంలో సోదరుడైన ఏపీ సీఎంపై కూడా షర్మిల విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆమె సోదరుడి పక్కనే కూర్చోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ రోజు హైదరాబాద్‌లో వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న వైఎస్ సంస్మరణ సభకు జగన్, షర్మిల హాజరవుతారా? లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.


Also Read: YS Vijayalakshmi Meet: వైఎస్ విజయలక్ష్మి ఆత్మీయ భేటీ నేడే, దీని వెనుక రాజకీయం అదేనా..? జగన్, షర్మిల హాజరవుతారా..?

నాన్న స్ఫూర్తే ముందుండి నడిపిస్తోంది: జగన్ ట్వీట్

‘‘నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’’ అని జగన్ ట్వీట్ చేశారు.





కుటుంబ సభ్యులంతా ఘన నివాళి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వారిలో జగన్‌తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల సహా ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ అభిమానులు ఉన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుంచి సోదరుడితో దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తున్న వైఎస్ షర్మిల ఈ సందర్భంగా సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు.

Background

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లిన వైఎస్ జగన్.. వైఎస్ ఘాట్ వద్ద కాసేపు గడిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.