రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) ఆమోదం తెలిపింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం జగన్ సీఐపీబీపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి, కాకాని గోవర్థన్ రెడ్డి, రోజా, ఆదిమూలపు సురేశ్, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టబడులకు ఆమోదం లభించగా, 69,565 మంది ఉద్యోగాల లభించనున్నట్లు భావిస్తున్నారు. 


విప్లవాత్మక మార్పు


పరిశ్రమల ఉత్పాదకతలో టెక్నికల్ పరంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వీటన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. మారుతున్న పోకడలకు అనుగుణంగా, పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని చెప్పారు. పారదర్శక విధానాల ద్వారా పరిశ్రమల స్థాపనకు సానుకూల వాతావరణం కల్పించామని, ఈ క్రమంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని గుర్తు చేశారు. ఇది ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.


ఒక్క ఫోన్ కాల్ తో సమస్య పరిష్కారం


పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన వారికి ఇచ్చే అనుమతులు, ఇతర అంశాల్లో ప్రభుత్వం నుంచి వేగంగా స్పందిస్తున్నామని, ఎక్కడా ఆలస్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టినట్లు సీఎం జగన్ వివరించారు. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ తో సమస్య పరిష్కరిస్తున్నామనే భరోసాను పెట్టుబడిదారులకు కల్పిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలపై చురుగ్గా వ్యవహించడం సహా, వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చామని, పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయంలో పెద్ద ఎత్తున మేలు చేకూర్చినట్లు స్పష్టం చేశారు.


ఆమోదం పొందింది ఇవే



  • చిత్తురూ జిల్లా పుంగనూరులో రూ.4,640 కోట్ల పెట్టుబడితో పెప్పర్ మోషన్ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ ఏర్పాటు. ప్రత్యక్షంగా 8,080 మందికి ఉద్యోగాల కల్పన

  • విజయనగరం జిల్లా ఎస్.కోటలో రూ.531 కోట్లతో JSW ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం.

  • శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.1,750 కోట్లతో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం.

  • అచ్యుతాపురం ఎస్ఈజెడ్ లో స్మైల్ కంపెనీ ఆధ్వర్యంలో AI ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్ కు ఆమోదం.

  • నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ కు ఆమోదం. ఇవికాక మరో 3 కంపెనీల విస్తరణకూ ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.

  • తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్ లిమిడెట్ కంపెనీ, ఏలూరు కొమ్మూరు వద్ద శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్, విశాఖ జిల్లా పద్మనాభం మద్ది వద్ద ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. 


Also Read: ఏపీ కేబినెట్ భేటీ మూడో తేదీకి వాయిదా- కారణం ఏమిటంటే ?