తమ సమస్యల్ని పరిష్కరించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్లపై పడ్డారు. ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీతో చర్చల కోసం సజ్జల సచివాలయానికి వచ్చారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు కూడా పీఆర్సీ అమలు చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సజ్జలను వేడుకున్నారు. కనీస వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.26 వేలకు పెంచాలని ఉద్యోగులు కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్‌లో చేర్చామని అని సజ్జల అన్నారు. దాంతో ఒకటో తేదీన జీతం తప్ప ఎలాంటి న్యాయం జరగలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సజ్జలను విజ్ఞప్తి చేశారు. సెక్రటేరియట్‌లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆయన ఆరా తీశారు. తమకు న్యాయం చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సజ్జల కళ్లపై పడ్డారు.
పీఆర్సీ జీతాలు అందించాలని విజ్ఞప్తి
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకొన్నారు. ఉద్యోగుల్లో కొంతమంది సజ్జల కాళ్లపై పడి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వేడుకున్నారు. పీఆర్సీ ప్రకారం తమకూ వేతనాలు పెంచాలని సజ్జలకు వినతిపత్రం అందించారు. ప్రస్తుత జీతాలతో తమ జీవనం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రభుత్వం ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా వారిని నిలువరించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. మంత్రుల కమిటీతో ఉద్యోగులు చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జీతాల పెంపు ప్రతిపాదనలు
ఏపీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సీనియర్ కేటగిరీలో అసిస్టెంట్, స్టెనో, అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్ తదితరులకు రూ.17,500 నుంచి రూ.21,500కు జీతం పెంచింది. మరోవైపు జూనియర్ విభాగంలో అసిస్టెంట్, స్టెనో, డ్రైవర్, టైపిస్ట్, మెకానిక్, ఫిట్టర్ తదితరులకు జీతాన్ని రూ.15 వేల నుంచి రూ.18,500కి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరితో పాటు సబార్డినేట్, వాచ్‌మెన్, కుక్, చౌకీదార్ తదితరుల జీతాన్ని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతున్నట్లు పేర్కొంది. కాగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెరిగిన జీతాలు జనవరి నెల నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.