AP Rajyasabha MPs : ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ చెందిన నలుగురు సభ్యులు వి. విజయసాయి రెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శుక్రవారం అమరావతి శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసన మండలి ఉపకార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డి ఏపీ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు. సభ్యులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఏపీలో రాజ్యసభకు నలుగురు సభ్యులు మాత్రమే నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ నెల 1వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తవ్వడం, నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన నేటి మధ్యాహ్నం 3.00 గంటల లోపు అభ్యర్థిత్వ ఉపసంహరణ నోటీసులు ఎటువంటివి అందకపోవడంతో ఈ నలుగురు సభ్యుల ఎంపిక ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ప్రకటిస్తూ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం
తెలంగాణలో రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. దీంతో రెండు స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి రెడ్డి మాత్రమే నామినేషన్లు వేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభ్య ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఆర్‌ఎస్ పార్టీ తన అభ్యర్థులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి పేర్లను ప్రకటించింది. వారితోపాటు మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయాగా, వారిద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగలడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సీఎం జగన్ ను కలిసిన నూతన ఎంపీలు
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, ఎస్.నిరంజన్ రెడ్డి కలిశారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్న నూతన రాజ్యసభ ఎంపీలు అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.