అమరావతి: ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీలో మరో నాలుగు రోజులపాటు అకాల వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేశాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, వర్షం పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి.
సోమవారం (మార్చి 23) నాడు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.
ఈదురు గాలులతో కూడిన వర్షాలు వర్షం కురిసే సమయంలో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు పొలాల్లో పనిచేసే వారు, గొర్రెల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది.
ఉష్ణోగ్రతల పెరుగుదలఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, భానుడి ప్రతాపంతో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆదివారం నాడు అనకాపల్లి, విశాఖపట్నం ఏలూరు, పోలవరం, కాకినాడ వంటి ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో పాటు ఒక్కసారిగా మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గత కొన్నేళ్లుగా హైదరాబాద్ వాతావరణంలో మార్పులు..
రుతుపవనాలు బలహీనపడుతున్నాయని కొందరు భావిస్తున్నప్పటికీ, వాస్తవానికి 2019 నుంచి హైదరాబాద్ నగరంలో వరుసగా భారీ వర్షాలు నమోదవుతున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వడం గత కొన్నేళ్లుగా మనం గమనిస్తున్న ప్రధాన మార్పు అన్నారు. అయితే, పట్టణ ప్రాంతాల్లో మారుతున్న సూక్ష్మ వాతావరణ పరిస్థితుల (Urban Microclimatic Conditions) కారణంగా వర్షపాతంలో అనిశ్చితి పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల వాతావరణ నమూనాలలో అకస్మాత్తుగా మార్పులు సంభవిస్తున్నాయి.
ఉష్ణోగ్రతల విషయానికి వస్తే 2019 నుండి 2024 మినహా వచ్చిన అన్ని వేసవి కాలాల్లోనూ వేడి సాధారణం కంటే తక్కువగానే నమోదైంది. అంటే మిగిలిన సంవత్సరాలతో పోలిస్తే వేసవి తీవ్రత కొంత తక్కువగానే ఉందని చెప్పవచ్చు. మరోవైపు, వింటర్ సీజన్లలో మాత్రం 2019 నుంచి కాస్త వెచ్చగానే ఉంటున్నాయి. కేవలం 2025 సీజన్‌లో మాత్రమే సాధారణ శీతాకాల పరిస్థితులు కనిపించాయి. ఇటీవల సైతం దాదాపు వారం రోజులపాటు తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
