AP Rains Latest News: ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. గత కొన్నిరోజులుగా మోస్తరు వర్షం పడగా.. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గోదావరి పరివాహక రాష్ట్రాల్లో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే శనివారం భద్రాచలం వద్ద వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా ప్రకారం.. ఆదివారం నుంచి వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు. బుధ, గురువారాల వరకు వరద ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. అల్లూరి, మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు.  శుక్రవారం (జులై 21న) రాత్రి 9 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.73 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రవాహం ఇలాగే కొనసాగితే శనివారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ పేర్కొంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేస్తున్నామని చెప్పారు. మొదటి హెచ్చరిక వస్తే ప్రభావితం చూపే 42 మండలాల జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు.






అత్యవసర సహాయక చర్యల కోసం మొత్తం మూడు బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఏలూరు జిల్లా కుకునూర్, వేలేర్పాడులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు చెప్పారు. ఈ బృందాలు ఓబియమ్ బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏమైనా అత్యవసరం అయితే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 లకు ఫోన్ చేయాలని సూచించారు.


తెలంగాణపై నైరుతి రుతుపవనాలు ఉధృతంగా ఉన్నాయి. నేడు వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ లు జారీ చేశారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial