Minister Ambati Rambabu: మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ పై మాజీ మంత్రి కన్నా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అని పేర్కొన్నారు. సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కన్నాపై తీవ్ర విమర్శలు చేశారు. రాజారెడ్డి గురించి ముఖ్యమంత్రి జగన్ గురించి అవాకులు చవాకులు పేల్చే స్థాయి కన్నా లక్ష్మీ నారాయణకు లేదన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో కన్నాకే తెలియదంటూ ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబును తిట్టి.. ఇప్పుడు ఆయన ఫోటోకే పాలాభిషేకం చేస్తున్నారని గుర్తు చేశారు.


అవకాశవాద రాజకీయాలు చేయడం కన్నా లక్ష్మీనారాయణకు బాగా అలవాటని చెప్పారు. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొని బీజేపీకి భయపడి హై డ్రామాలు చేసిన వ్యక్తి కన్నా కాదా అని ప్రశ్నించారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే స్థాయి కన్నాకు లేదని అంబటి తెలిపారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ కేవలం ఇంచార్జ్ మాత్రమేనని అన్నారు. ఆయన పోటీ చేస్తాడో పారిపోతాడో తెలియదన్నారు. బీజేపీ ఎన్నికల ఖర్చు కోసం ఫండ్ పంపితే.. మొత్తం మింగేసిన ఘనత మాజీ మంత్రి కన్నాది అని పేర్కొన్నారు. కన్నా సంగతి అమిత్ షాకు బాగా తెలుసని అంబటి స్పష్టం‌ చేశారు. 


"పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదని అనుకుంటది. నీ చరిత్ర అందరికీ తెలుసు. కాంగ్రెస్ వాళ్లను అడిగినా చెప్తారు. బీజేపీ వాళ్లను అడిగినా చెప్తరు. అంతెందుకు.. కన్నా వారితోటలో వారి ఇంటి సంధు ముందు ఒకటి పెద్ద బోర్డు ఉంటుంది కదా. ఆ బోర్డును అడిగినా చెబుతారు. ఆ బోర్డు మీద ఒకటి కాంగ్రెస్, తర్వాత బీజేపీ, తర్వాత వైసీపీ. ఉంచారా వాటిని ఇప్పుడు తీసేశారా. ఆ మధ్య మనోహర్ గారైతే జనసేన గ్లాసు కూడా వేద్దామనుకున్నారు. పైన రాసే వరకు తీసేశారు. వెంటనే టీడీపీది వేసేశారు. ఇప్పుడైనా అందులోనే ఉంటారని గ్యారంటీ ఉందా. అధికారం కోసం పాకులాడుతూ.. వెంట వెంటనే పార్టీలు మారడం దారుణం. ఇలాంట నువ్వు రాజిశేఖర్ రెడ్డి గారి గురించి, రాజారెడ్డి గారి గురించి, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడున్నావంటే నవ్విపోదురుగాక. మాట్లాడినప్పుడు మీరు కంట్రోల్ లో మాట్లాడకపోతే మేము చాలా గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది." - మంత్రి అంబటి రాంబాబు


నోరు అదుపులో ఉంచుకోకపోతే ఇబ్బందులు తప్పవు..


కన్నా సంగతి గుంటూరు ప్రజల కన్నా వారి తోటలో ప్రజలు బాగా చెబుతారంటూ విమర్శించారు. అలాగే ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీలు కూడా ఆయన గురించి చెబుతాయంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఆయన ఇంటిపై ఉంటాయంటూ చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ తన నోరును అదుపులో ఉంచకపోతే ఇబ్బందులు తప్పవని సూచించారు. చంద్రబాబు మీద చేసినట్లు.. సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేస్తే వైసీపీ సహించదని హెచ్చరించారు.