AP Police Arrested YS Sharmila: ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ గురువారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. విజయవాడలోని (Vijayawada) ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సచివాలయానికి బయలుదేరారు. పలు చోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు.. తొలుత పార్టీ నేతలు, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీలను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల కారు దిగగానే ఒక్కసారిగా చుట్టుముట్టి ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ వాహనం ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. షర్మిలతో పాటు ఇతర నేతలు, కార్యకర్తలను మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
'వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది'
వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసేది నిరుద్యోగుల కోసమేనని.. సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి స్వేచ్ఛ కూడా లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది. ఈ ఘటనపై అమ్మ కూడా బాధ పడుతుంది. జర్నలిస్ట్ లకు స్వేచ్చ లేదు సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరట. సీఎం రారు.. మంత్రులు లేరు.. అధికారులు రారు. వీళ్లకు పాలన చేతకాదని అనడానికి ఇదే నిదర్శనం. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్లు ఇవ్వడం చేత కాలేదు. ఒక అడబిడ్డ అని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం దారుణం.' అని మండిపడ్డారు.
రోడ్డుపైనే బైఠాయింపు
ఏపీలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. దగా డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ గురువారం తలపెట్టిన 'ఛలో సెక్రటేరియట్' (Chalo Secratariat) నిరసన కార్యక్రమంలో నేతలను అడ్డుకోవడంతో విజయవాడలో (Vijayawada) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల సహా ఇతర నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఆమె ఆంధ్ర రత్న భవన్ వద్దే బైఠాయించి నిరసన తెలుపుతూ.. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు చదివిన చాలా మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. దాదాపు 21 వేల మంది బిడ్డలు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఓ సర్వేలో తేలినట్లు షర్మిల చెప్పారు.
ఉద్యోగాల భర్తీ పేరిట కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని షర్మిల మండిపడ్డారు. '5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 1.43 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో పెట్టి దిగిపోయారు. ఆ తర్వాత జగనన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 25 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే.. 7 వేల ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు.? 7 వేల ఉద్యోగాలూ ఇవ్వలేదని చంద్రబాబును నాడు మీరు అడగలేదా.? ఆ మాటలు ఇవాళ మీకు వర్తించవా.? నిరుద్యోగులపై మీకు దయ లేదా.? మెగా డీఎస్సీ కాకుండా దగా డీఎస్సీ ఇచ్చారు. పట్టపగలే పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వారి కార్యకర్తలకు ఇచ్చారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలేవీ.?' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read: టీడీపీ పాలనలో పులివెందులకు నీళ్లు- జగన్ హయాంలో కుప్పానికి జలాలు- ఇదే స్ఫూర్తి రాష్ట్రమంతటా ఉంటే..