Maosists Vaarotsavalu: మన్య ప్రాంతం జిల్లాగా ఏర్పడిన తరువాత మొదటి సారిగా మావోయిస్టులు ఈనెల 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే  జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. గిరిజన ప్రాంతాలతో పాటుగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అల్లూరి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అరకు లోయ పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన పోలీసు పికిటింగ్ తో పాటు, సంఘ విద్రోహుల ప్రతి చిన్న కదలికలపై డేగ కన్ను వేసినట్టు అరకు సీఐ శ్రీ జీడి బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా అరకలోయ, అనంతగిరి డుబ్రిగూడ మండలాలలోని  పోలీసులు.. తమ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నారు. 


గ్రామాలు, తండాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్..


ఈ సందర్భంగానే ముఖ్య గిరిజన గ్రామంలోనూ, పట్టణంలోనూ పోలీసులు ప్లాగ్ మార్చి నిర్వహించారు. అన్ని వీధులలో పోలీసులు కలియ తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఎలాంటి సంఘ విద్రోహ శక్తుల విషయమై అనుమానం కలిగితే ప్రజలు తమ దృష్టికి తీసుకొని రావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అరకు లోయ పట్టణంలోని క్రైం రేటు అధికంగా గల కొండవీధి ప్రాంతాలలో గంజాయి, సారాయి, గుట్కాలకు  బానిసలైన యువతను ఆయన కలసి గతంలో తాము ఇచ్చిన కౌన్సిలింగ్ ఎంత వరకు వారిలో ఫలితాలను తీసుకొచ్చిందో వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలో పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నదీ వాకబు చేశారు. 


సీఐ వల్లే మా గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి...


ఈ సందర్భంగా పట్టణంలోని మహిళలు మాట్లాడుతూ.. సీఐ జి.డి.బాబు వచ్చిన తరువాత తమ ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటున్నాయని చెప్పారు. తాగుడుకు బానిసలైన తమ భర్తలు, పిల్లలు చెడు అలవాట్లను మానుకున్నారని వివరించారు. గతంలో ఓ వైపు భర్తలు, మరోవైపు పిల్లలు తాగి వచ్చి నానా గొడవలు చేసేవారని.. వాళ్లని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వాపోయారు. కానీ సీఐ బాబు వచ్చినప్పటి నుంచి.. ఎప్పుడూ గొడవలు జరిగే తమ ఇళ్లల్లో ప్రేమానురాగాలు కనిపిస్తున్నాయని.. దీనంతటికీ కారణం.. పోలీసు శాఖే అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సీఐకి ధన్యవాదాలు చెప్పారు. 


పోలీసుల చేసే ప్రతీ చర్యకు ప్రజలు సహకరించాలి..


మావో వారోత్సవాలను నిర్వీర్యం చేసే దిశగా ప్రత్యేక  గ్రేహౌండ్స్ దళాలను, స్పెషల్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలను  అరకులో సర్కిల్ పరిధిలో అధిక సంఖ్యలో దించడం జరిగిందని సి.ఐ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూంబింగ్ ఆపరేషన్లు, రోడ్డు మార్చింగులు, వాహన తనిఖీలు, అనుమానితులను తనిఖీ చేస్తారని వివరించారు. ఈ చర్యలన్నీ వారం రోజుల పాటు ముమ్మరంగా జరుగుతాయనీ ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. ప్రజలకు అన్ని విధాలుగా భరోసా తమ శాఖ కల్పిస్తుదనీ సి.డి.బాబు తెలిపారు.