AP Pensions : ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు ఎన్నికల నేపథ్యంలో గందరగోళం ఎదురైన సంగతి తెలిసిందే.   ఈ క్రమంలో అసలు జూన్ నెలకు సంబంధించి పింఛన్లు తమకు వస్తాయా ? లేదా ? ఒక వేళ వస్తే ఎప్పుడు వస్తాయి?  ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్లు  ఇస్తారా, లేక మళ్లీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారా ?  ఇలా అనేక  ప్రశ్నలతో గందరగోళం మధ్య పింఛన్ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే జూన్ నెలకు సంబంధించిన పింఛన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  


 జూన్ నెల పించన్ పంపిణీ ఇలా
ఈ మేరకు పింఛన్లను జూన్ 1న  లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్ చైర్ లో ఉన్న వారికి నేరుగా వాళ్ల ఇంటి వద్దకే వెళ్లి వారికి పింఛన్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


పింఛన్ సొమ్ము విడుదల
జూన్ నెలకు చెల్లించాల్సిన సామాజిక భద్రతా పింఛన్ల డబ్బును విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  65,30,808 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.1,939.35 కోట్లను విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ప్రకటించారు. జూన్ 1న 47,74,733 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పింఛను సొమ్ము జమ చేస్తామని చెప్పారు.  17,56,105 మంది లబ్ధిదారులకు జూన్ ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు.  ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు పంపిణీ చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.  సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్ డబ్బులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ లబ్ధిదారులను ఇళ్ల నుంచి బయటకు రప్పించి..  ఏప్రిల్‌ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫించన్లను పంపిణీ చేశారు.   మే నెలలో బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసింది ప్రభుత్వం. ఇప్పుడూ కూడా మళ్లీ అదే విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
వడదెబ్బతో పలువురు మృతి
 గత నెలలో బ్యాంకు ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయడంతో లబ్ధిదారులు బ్యాంకులకు పోటెత్తారు. అక్కడ విపరీతమైన రద్దీ కారణంగా పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.   పింఛన్ కోసం బ్యాంకులకు వెళ్లి వడదెబ్బ కారణంగా అనేకమంది వృద్ధులు చనిపోయారు. మరికొందరికి బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో నేరుగా ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు చెల్లించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.