AP PCC chief Sharmila : వైఎస్ఆర్‌సీపీపై షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉంది YCP నేతల తీరు ఉందన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. తమను తోక పార్టీ అనడంపై విరుచుకుపడ్డారు. తల్లికి వందనం ఉత్తర్వులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని షర్మిల మండిపడ్డారు. YCP నేతలకు కళ్ళుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే... తాము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలని సూచించారు.
తల్లికి వందనంపై ప్రభుత్వాన్నిప్రశ్నిస్తే తోక పార్టీ అంటారా ?
తల్లికి వందనం GO 29 క్లారిటీ లేదని, సాక్షి పత్రిక రాసిన వార్తకి వివరణ ఇవ్వాలని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేశామన్నారు. ఇలా డిమాండ్ చేయడం కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుందని గుర్తు చేశారు. ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుందన్నారు. YCP నేతలకు బహిరంగ సవాల్ చేస్తున్నానని 2019 ఎన్నికల కంటే ముందు జగన్ గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు.
అమ్మఒడి పిల్లలందరికీ వర్తింప చేస్తామని చెప్పి మోసం చేసింది జగన్ కాదా ?
వైసీపీ ఇంట్లో ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి ఇస్తామని చెప్పిందని.. ఆ ముక్క పట్టుకొని తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశాననన్నారు. అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా అనేది చెప్పాలన్నారు. మోసం చేశారని ప్రజలు మీకిచ్చిన తీర్పే చెప్తోంది. ఆ రోజు నా చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా అని మండిపడ్డారు. తాను వైసీపీ కోసం బై బై బాబు కాంపెయిన్ చేయడం ఎంత నిజమో అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15000 రూపాయిలు చొప్పున, ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజమన్నారు.
చర్చకు సిద్ధమా ?
వైసీపీ నేతలకు 15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారని షర్మిల ప్రశ్నించారు. మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు.. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం అని… జలయజ్ఞం పూర్తి చేస్తాం అని… ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎందుకు కాంపెయిన్ చేయించారని ప్రశ్నించారు. వీటన్నింటిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.