Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బేసిన్ చాలా కీలకం. అయితే ఈ ఏడాది కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేక గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ సమయానికి 25 -30 టీఎంసీల నీరు వచ్చేది. తర్వాత కాస్త ఆలస్యం అయినా వందకు పైగా టీఎంసీలు వచ్చేవి. అలా ఆగస్టు మొదటి వారంలో దిగువకు నీటిని విడుదల చేసేవారు. జులై నెల ప్రారంభంలో ఎంత తక్కువ అయినా 30 టీఎంసీల ప్రవాహం వచ్చేది. కానీ ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి దారుణంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే దశాబ్దం నాటి సంక్షోభం పునరావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం మొదలై 40 రోజులు కావొస్తుంది. అయినా కృష్ణా నదిలోకి చుక్క నీరు కూడా రాలేదు. ఆలమట్టిలోకి ఇప్పటి వకు వచ్చిన నీరు జీరో టీఎంసీ.. అంటే నీటి ప్రవాహం శూన్యం. మొత్తానికి నీరు రాకపోవడం ఆలమట్టి నిర్మించిన తర్వాత ఇదే మొదటిసారి. 


ఈ ఏడాది పరిస్థితి దారుణం


తెలంగాణలోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి.. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టులు.. కృష్ణానదిపై ఆధారపడి ఉన్నాయి. వీటికి శ్రీశైలం, జురాల, నాగార్జున సాగర్ మీదుగా ప్రవాహం వస్తుంది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించగా.. ఇందులో 450 టీఎంసీలు ఎగువ నుంచి రాష్ట్ర ప్రాజెక్టులకు రావాలి. ప్రత్యేకించి ఆలమట్టి నుంచి ఎక్కువగా, తుంగభద్ర నుంచి కొంత రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల్లోకి అసలు ప్రవాహం లేకపోవడం, నీటి జాడ కానరాకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నామని నీటి పారుదల శాఖ వర్గాలు అంటున్నాయి.


Also Read: Student Accommodation: హలో స్టూడెంట్స్! హాస్టల్‌లో జాయిన్ అవబోతున్నారా? వీటి గురించి తప్పక తెలుసుకోండి


ఆలమట్టికి ఇప్పటి వరకు చుక్కనీరు రాలేదు


2002-03, 2003-04, 2015-16 సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం అప్పటికంటే దయనీయంగా ఉంది పరిస్థితి. కృష్ణా నది కర్ణాటక దాటిన తర్వాత మొదట తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు ఉన్నా.. దీని సామర్థ్యం తక్కువ కాబట్టి దీనికి దిగువన ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు జలవిద్యుత్తుకు, సాగునీటి అవసరాలకు కీలకం. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీరు దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు చేరుతాయి. అలా నాగార్జున సాగర్ కు చేరాలంటే.. శ్రీశైలం జలాశయానికి కనీసం 100 టీఎంసీలు అయినా రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు శ్రీశైలం జలాశయానికి వచ్చిన ప్రవాహం కేవలం 1.3 టీఎంసీలు మాత్రమే. గతంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు ఇలాంటి దయనీయ పరిస్థితి ఎదుర్కొంది. కానీ అప్పుడు ఆలమట్టి జలాశయానికి కొంతలో కొంత ప్రవాహం వచ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం ఆలమట్టికి చుక్కనీరు రాలేదు. ఈ ఏడాది పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఆలమట్టిలో ప్రవాహం మొదలైతే గానీ అంచనా వేయలేమని అధికారులు అంటున్నారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial