Hyderabad Vijayawada Traffic: భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాకపోకలను పునరుద్ధరించారు. హైదరాబాద్ - విజయవాడ హైవేలో (ఎన్‌హెచ్-65) నందిగామ ఐతవరం సమీపంలో రోడ్డుపైకి భారీగా వరద చేరడంతో రాకపోకలు ఆపేశారు. ఇప్పుడు వరద తగ్గటంతో వాహనాలను అనుమతిస్తున్నారు. కానీ, హైవేపై బురద పేరుకుపోయింది. అందుకని వాహనాలను నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
దాదాపు 30 గంటల తర్వాత వాహనాలను అధికారులు అనుమతిస్తున్నారు. ఐతవరం వద్ద రోడ్డు మీదుగా మున్నేరు నది వరద ప్రవాహం తగ్గడంతోనే.. ఒక్కొకటిగా వాహనాలను నెమ్మదిగా అధికారులు అనుమతిస్తున్నారు. ఐతవరంలో నిలిచిన వాహనాలను పోలీసులు దగ్గరుండి ఒక్కొక్కటిగా పంపిస్తున్నారు. గడిచిన 30 గంటలుగా ఈ వరద ప్రవాహం కారణంగా.. రోడ్డు పొడవునా ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఇలా భారీగా నిలిచి ఉన్న వాహనాలను తాజాగా అనుమతిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని గరికపాడు వద్ద కొత్త వంతెన మీదుగా కూడా రాకపోకలు సాగుతున్నాయి.
సొంత గ్రామానికి ఎమ్మెల్యే
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సోమవారం తన సొంతూరు ఐతవరం చేరుకున్నారు. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వాహనంలో ఎక్కి వరదను దాటుతూ ఎమ్మెల్యే ఐతవరానికి చేరారు. మూడు రోజులుగా మైలవరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు. ఐతవరం దగ్గర హైవేపై ప్రతిసారి వరద ప్రవాహం ఉంటుండడంతో అక్కడ బ్రిడ్జి నిర్మాణం గురించి హైవే అథారిటీతో జరిగే సమావేశంలో మాట్లాడతానని చెప్పారు.