AP Latest News: ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఉన్నతాధికారుల బదిలీలు జోరుగా సాగుతున్నాయి. రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగించింది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్లను కూడా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 


జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హాయాంలో డీజీపీగా పని చేసిన కసిరెడ్డి వి.రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. జగన్ ప్రభుత్వ హాయాంలో సస్పెన్షన్ కు గురై న్యాయపోరాటం చేసి తిరిగి ఉద్యోగంలో చేరిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఒక్క రోజు డ్యూటీ చేసి ఎక్కడైతే రిటైర్ అయ్యారో అదే పోస్ట్ మాజీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి ఇచ్చారు.


ఫైర్ డీజీ సునీల్ కుమార్‌ను జీఏడీకి రిపోర్ట్ చేయమని ఆదేశించింది. శంఖబ్రాత బాగ్చీకి ఫైర్ సర్వీసెస్ అదనపు బాధ్యతలు అప్పగించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఉన్న వై రిషాంత్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈయన ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతల్లో ఉండగా వాటి నుంచి కూడా రిలీవ్ చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ లో ఖాళీ అయిన స్థానాల బాధ్యతలను కొత్త వారిని నియమించే వరకూ ఇతరులకు ఇవ్వాలని డీజీపీ ఆఫీసుకు నిర్దేశించారు.