Tomota sent to Vijayawada from Anantapur Market | రాప్తాడు: ఏపీలో వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 74 ఏళ్ల వయసులో కూడా నిత్య యువకుడిలా పని చేస్తున్నారని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. విజయవాడ ప్రాంతంలోని వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా టమోటా మండి ఓనర్స్ అసోసియేషన్ వారు ముందుకొచ్చారు. అనంతపురం మార్కెట్ నుంచి 40 టన్నుల టమోటాను ప్రత్యేక వాహనాల్లో పంపే ఏర్పాట్లు చేశారు. ఈ టమోటాను విజయవాడకు రవాణా చార్జీలు లేకుండా తీసుకెళ్లేందుకు లారీ ఓనర్స్ అసోషియేషన్ వారు ముందుకొచ్చారు. 


అనంతపురం నుంచి విజయవాడకు భారీ సాయం
ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగా శుక్రవారం నాడు (సెప్టెంబర్ 6న) వాహనాలను విజయవాడకు పంపారు. సునీత జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ.. కనివినీ ఎరుగని రీతిలో విజయవాడ ప్రాంతంలో వరదలువచ్చి.. వేలాది కుటుంబాలు నిరాశ్రయలుగా మిగిలారు. బాధితుల్ని ఆదుకునేందుకు టమోటా మండి ఓనర్స్ ముందుకు రావడంపై ఆమె అభినందించారు. అలాగే రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన లారీ, ఐచర్ వాహణాల అసోసియేషన్ సభ్యుల్ని కూడా అభినందించారు. ఇంకా చాలా మంది వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. వీరిని ఆదుకునేందుకు చంద్రబాబు గత ఐదు రోజులుగా అక్కడే ఉన్నారన్నారు. 


గత సీఎం విమానాల్లో పర్యటనలు - ట్రాక్టర్లు, జేసీబీలు ఎక్కుతూ చంద్రబాబు
పగలు, రాత్రి అనే తేడా లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. బాధితులను సీఎం చంద్రబాబు ఆదుకుంటున్నారని చెప్పారు. 74 ఏళ్ల వయసులో జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం ఇంత సాయం చేస్తుంటే.. వైసీపీ నేతలు వరదల సమయంలో కూడా బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు వరదలపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై చేస్తున్న వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షేత్ర స్థాయికి వెళ్లకుండా విమానాల్లో పర్యటించిన విషయం మరువద్దని వైసీపీ నేతలకు సూచించారు. ఇలాంటి కష్ట సమయంలో కూడా రాజకీయాలు మానకపోతే.. ప్రజలు ఎప్పటికీ క్షమించరని పరిటాల సునీత మండిపడ్డారు.


Also Read: Chandrababu: ఏపీలో వరదలపై ఒక్క రూపాయీ ఇవ్వలేదు - కేంద్రం సాయంపై చంద్రబాబు స్పష్టత