AP Mlc Elections : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏపీలోని 9 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.  ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ధీమాతో ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు 13 ఉమ్మడి జిల్లాల్లో 9 జిల్లాల అభిప్రాయాన్ని వెల్లడించబోతున్నాయి.  


ఐదు స్థానాలకు ఎన్నికలు 


ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 3 పట్టభద్రులు, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 6 జిల్లాల్లో 331 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 2.09 లక్షల ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులు ఎన్నికల సిబ్బంది పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 49, అల్లూరి జిల్లాలో 15, మన్యం జిల్లాలో 24, విజయనగరం జిల్లాలో 72, శ్రీకాకుళం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.


సెమీ ఫైనల్స్ 
 
సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికారపార్టీ పావులు కదుపుతుంది. విపక్షాలు సైతం  ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా ప్రచారం చేశాయి. తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖలో గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఎన్నికలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం షాపులను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చింది.  పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తుకుండా చర్యలు చేపట్టారు. 


ఎన్నికల సామాగ్రి పంపిణీ 
 
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం 72 పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేశారు. విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్‌లో 33,643 ఓట‌ర్లు, చీపురుప‌ల్లిలో 14,256 మంది, బొబ్బిలిలో 10,603 మంది ఓట‌ర్లు ఉన్నారు. విజయనగరం జిల్లాలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ కోసం 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్‌లో 42, బొబ్బిలిలో 13, చీపురుప‌ల్లిలో 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ నిర్వహణ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. ఎన్నిక‌ల సిబ్బందిని కూడా పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లించేందుకు డివిజ‌న్ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూష‌న్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎన్నిక‌ల సామాగ్రి పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లించేందుకు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సులు సిద్ధం చేశారు. 72 పోలింగ్ కేంద్రాల‌కు 72 మంది  పీవో ల‌తో పాటు రిజ‌ర్వులో మ‌రో 18 మందిని పీవోలు, 144 మంది ఓపీవోలు, మ‌రో 41 మంది రిజ‌ర్వు సిబ్బందిని సిద్ధం చేశారు. విజయనగరం జిల్లాను మొత్తం 13 జోన్లుగా చేసి 13 మంది జోన‌ల్ అధికారుల‌ను నియ‌మించారు.