YSRCP News : విశాఖ ఎయిర్ పోర్టులో కోడికొత్తితో జనపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు సీఎం జగన్ పై చేసిన దాడి విషయంలో ఎన్ఐఏ కౌంటర్‌ రిపోర్టులో ఉన్న విషయాలు విపక్ష నేతలకు ఎలా తెలుసని వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నించారు.  విశాఖ ఎయిర్ పోర్టులో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి  పై జరిగిన దాడి వాస్తవమని విద్యా శాఖామంత్రి బొత్సా సత్యనారాయణ  స్పష్టం చేశారు. కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయన్నారు. కోడి కత్తి దాడి జగన్   చేయించుకున్నారన్న భావన కల్పిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌  పై ఎయిర్ పోర్ట్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అలిపిరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్షల్స్ దాడి చేశారని... అది కూడా రాజకీయ లబ్దికోసం బాబు చేయించుకున్నాడా అంటూ ప్రశ్నించారు. కోడికత్తి దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశ్యంతో చేశాడో తెలియాలన్నారు. ఎన్‌ఐఏ రిపోర్ట్‌లో ఏముందో ఎలా తెలిసిందని మంత్రి బొత్స ప్రశ్నించారు.


చంద్రబాబుపై రోజా విమర్శలు


జగన్ స్టిక్కర్ల మీద చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.  టీడీపీ, జనసేన వాళ్లు దొంగతనంగా వెళ్లి పోటీగా స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఒక పది ఇళ్లకు ఇలా చేసి తమ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. టిట్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అది సెల్ఫీ కాదు, సెల్ఫ్ గోల్. మా నగరిలో లేదా మీ కుప్పంలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో చూద్దామా? ఇదే నా సవాల్. ఈ సవాల్ తీసుకుంటావా చంద్రబాబూ? రాజకీయాల్లో వంద శాతం సంతృప్తి చేయగలమా? అనే డౌట్ ఉండేది. కానీ జగన్ పాలనలో చేసి చూపించారన్నారు.  'మెగా సర్వే చేయటానికి దమ్ము ఉండాలి. సీఎం జగన్‌కు దమ్ముంది. తన పాలనపై నమ్మకం ఉంది. అందుకే ఏడు లక్షల మంది సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజలంతా మాకు మద్దతు తెలుపుతున్నారు. వాలంటీర్లంతా జగన్ సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఆయన మీద నమ్మకంతో అన్ని వర్గాల వారు ఉన్నారు. గతంలో ఏ ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరగలేదని జనం చెప్తున్నారు. ఇప్పుడు జగన్ పాలనలో ఇంట్లో నుంచి బయటకు రాకుండానే వాలంటీర్లు చేసి పెడుతున్నారని చెప్తున్నారు. అందుకే జగన్ సైన్యం అంటే ప్రజలకు అంత ప్రేమ అని రోజా చెప్పుకొచ్చారు.  


పాలనలో తేడా ప్రజలు గమనించారన్న జోగి రమేష్ 


 చంద్రబాబు పాలనకు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకూ ఉన్న తేడాను ప్రజలు గమనించారని, అందుకే ప్రజలంతా మా భవిష్యత్తు నువ్వే జగన్ అంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు ఏడు లక్షల మంది సైన్యం అక్కాచెల్లెమ్మల ఇళ్లకు వెళ్లగా.. వారంతా ఎంతో అభిమానంతో మెగా సర్వేకు సహకరిస్తున్నారని చెప్పారు. వారం రోజుల్లో 63 లక్షల కుటుంబాల సర్వే చేయగా.. సీఎంకు మద్దతు తెలుపుతూ 47 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ఇది ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకమని, ఇదొక చారిత్రాత్మక ప్రజామద్దతుగా పేర్కొన్నారు. పాదయాత్రలో వైఎస్‌ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని మ్యానిఫెస్టోలో పెట్టడంతో పాటు అవన్నీ పరిష్కరిస్తున్నారన్నారు. 


ప్రజలకు జరిగిన మేలు వివరిస్తున్నామన్న మంత్రి సురేష్ 
 
గణాంకాలతో ప్రజలకు జరిగిన మేలును వివరిస్తున్నామని మంత్రి సురేష్ తెలిపారు.  మాకు ఓటు వేయని వారికి కూడా సాయం చేశామని, అందరికీ మేలు చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. టీడీపీ కోటలు బద్దలు అవుతున్నాయి.. ఏడు లక్షల మంది సైనికులు చేస్తున్న సర్వేలో అదే తేలుతోందని ‍స్పష్టం చేశారు. కరోనా వలన ఆర్ధిక సమస్యలు వచ్చినా ఏపీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని.. సీఎం జగన్ సువర్ష పాలనలోనే ఇది సాధ్యం అయిందని చెప్పారు.