Goutham Reddy Death News Live: మేకపాటి తండ్రి రాజమోహన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ఓదార్పు - ఏపీలో రెండ్రోజులు సంతాప దినాలు
Mekapati News Live: ఆదివారం దుబాయ్ నుంచి తిరిగి వచ్చాక మేకపాటికి గుండెపోటు వచ్చింది. చికిత్స పొందుతూ చివరికి అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Gowtham Reddy) భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని మేకపాటి ఇంటికి చేరుకున్న చంద్రబాబు మంత్రికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
ఏపీలో ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగిన నాయకుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ఇక లేరనే విషయం తెలుసుకొని తాను దిగ్భ్రాంతి చెందానని అన్నారు. ఈ సమయంలో తనకే చాలా బాధ కలుగుతోందని, అలాంటిది తన కుటుంబ సభ్యులు ఎంతటి వేదన అనుభవిస్తున్నారో అని అన్నారు. వారికి ధైర్యంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మేకపాటి తనకు గత 15 ఏళ్లుగా తెలుసని గుర్తు చేసుకున్నారు. గౌతం రెడ్డి తండ్రితో తాను మాట్లాడానని అన్నారు. ఇలాంటి దిగ్ర్భాంతికర సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని భరోసా కల్పించినట్లుగా మంత్రి కేటీఆర్ చెప్పారు.
జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అపోలో హాస్పిటల్ కు ఆయన వెళ్లారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తలసాని తెలియజేశారు.
రెండో దఫా కొవిడ్ సోకిన తర్వాత మంత్రి మేకపాటి ఆరోగ్యం కాస్త క్షీణించినట్టు తెలుస్తోందని, దానికి సంబంధించి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై ఉంటారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. మేకపాటి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి, జగన్ కు అత్యంత సన్నిహితులని చెప్పారు ఆనం రామనారాయణ రెడ్డి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు.
జూబ్లీహిల్స్ లోని నివాసానికి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలించారు. సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ లోని నివాసంలోనే అభిమానుల సందర్శనార్ధం గౌతమ్ రెడ్డి భౌతికకాయం ఉండనుంది. రేపు నెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రేపటికి స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. ఎల్లుండి నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఆత్మీయుడు, మంచి సహచరుడు, సమర్ధుడైన నాయకుడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దశాబ్దాలుగా మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిదని, గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. తమ సహచరుల్లో ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో ఇష్టమైన, సన్నిహితుడైన గౌతమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక, నైపుణ్యభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తీసుకు రావడం వెనక ఆయన విశేషమైన కృషి దాగి ఉందని గుర్తు చేశారు. గౌతమ్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని కృష్ణదాస్ వ్యక్తం చేశారు.
మంత్రి మేకపాటికి నెల్లూరు జిల్లాలో పర్సనల్ ఫొటోగ్రాఫర్ ఉన్నారు. ఆయన గాగుల్స్ పెట్టినా, క్యాప్ పెట్టినా, స్టైలిష్ డ్రస్సులో వచ్చినా.. కోదండపాణి కెమెరా క్లిక్ చేయడానికి రెడీగా ఉంటారు. ఫొటోలు తీసిన వెంటనే ముందు ఆయనకే చూపిస్తారు. ఆయన శభాష్ కోదండపాణి అంటే మురిసిపోతారు. ఆ ఫొటోగ్రాఫర్ మంత్రి మరణ వార్త విని కన్నీరు మున్నీరవుతున్నారు. మళ్లీ తనను అలా మెచ్చుకునే వారు ఎవరని వాపోయాడు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి మృతి ప్రభుత్వానికి తీరనిలోటని నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదని, గౌతం రెడ్డి అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, ఎవరిపైనా కొపగించుకున్న సందర్భం ఇంత వరకూ చూడలేదని అన్నారు. అటువంటి వ్యక్తి మన మధ్య లేడు అన్న వార్త విని తట్టుకోలేక పోతున్నామని కన్నీటి పర్యంతం అయ్యారు. గౌతం రెడ్డి ఇక లేరు అనే వార్త వారి కుటుంబ సభ్యులకు ఎవరూ తీర్చని లోటని, ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా తట్టుకుంటారో అర్థం కావడం లేదని అన్నారు. జగనన్న కష్టాల్లో ఉన్న సమయంలో నేను ఉన్నాను అన్న అనే ధైర్యం చేప్పిన వ్యక్తి గౌతం రెడ్డి అని ఆమె తెలిపారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వరుసగా రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయినా ఆయన గెలిచారు, పార్టీ కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా చూసుకున్నారు. ముఖ్యంగా యువ నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహించారు. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక, మంత్రి అయిన తర్వాత కూడా ఆయన నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తరచూ ఆత్మకూరుకి వస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులోని మంత్రి పార్టీ కార్యాలయం శ్రీ కీర్తి నిలయం శోకసంద్రంగా మారింది.
మంత్రి మేకపాటి మరణ వార్త తెలుసుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ ఉన్న మేకపాటి కుటుం సభ్యులను పరామర్శించారు.
మేకపాటి గౌతం రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఎల్లుండి ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణ వార్త తెలుసుకొని సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఆయన హైదరాబాద్‌కు పయనం అయ్యారు. కాసేపట్లో సీఎం జగన్ హైదరాబాద్ చేరుకోనున్నారు.
Background
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందారు. ఆయనకి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లుగా వైద్యులు సోమవారం ఉదయం ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన వయసు 49 సంవత్సరాలు మాత్రమే. మంత్రి చనిపోయిన విషయాన్ని అపోలో వైద్యులు ఆయన భార్యకు ఫోన్ చేసి తెలిపారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
మేకపాటి రెండ్రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ఎక్స్ పోకి వెళ్లారు. నిన్ననే (ఫిబ్రవరి 21) తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగిన వెంటనే ఆయనకు అస్వస్థత కలిగింది. ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. గుండె పోటుతో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచారు. మేకపాటికి ఇప్పటికే రెండుసార్లు కరోనా సోకింది. పోస్ట్ కొవిడ్ లక్షణాలు ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చేందుకు దారి తీశాయా అని అనుమానిస్తున్నారు.
నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతం రెడ్డి. 1971 నవంబరు నవంబరు 2న గౌతం రెడ్డి జన్మించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి వీరి సొంత గ్రామం. ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మేకపాటి ఎంఎస్సీ (టెక్స్‌టైల్స్) పట్టా పొందారు. 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన అదే సంవత్సరం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2019 ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రావడంతో ఆయన్ను మంత్రి పదవి వరించింది.
మేకపాటి గౌతం రెడ్డికి రాజకీయాల్లో చాలా మృదుస్వభావిగా మంచి పేరుంది. ప్రత్యర్థి పార్టీల వారు ఎంతగా రెచ్చగొట్టేలా మాట్లాడినా మేకపాటి మాత్రం సున్నితంగా స్పందించేవారు. అందరితో చాలా సన్నిహితంగా ఉంటారని తోటి నాయకులు చెబుతూ ఉంటారు.
మంత్రులు, వైసీపీ శ్రేణుల దిగ్భ్రాంతి
మేకపాటి గౌతం రెడ్డి చనిపోయిన వార్తను తెలుసుకొని వైసీపీ శ్రేణులు దిగ్భ్రాంతి చెందారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు నాయకులు అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -