నేను చూడలా.. నేను వినలా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్స్ ఇవి. తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, వైసీపీ నేతలను పొడుగుతున్న విషయంపై జోగి ఈ తరహా కామెంట్స్ చేశారు.


జోగి కామెంట్స్ వెనుక పెద్ద కథే ఉంది...
ప్రస్తుత రాజకీయాల్లో తెలుగు దేశం పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులను పొగడ్తలతో మాట్లాడటం చర్చనీయాశంగా మారింది. అయితే ఈ వ్యవహరంపై మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ నేను చూడలా... నేను వినలా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహరం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేశినేని నాని చేసిన కామెంట్స్ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన శాసన సభ్యులు సైతం కేశినేని నానిని అభినందించటం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయాలేవి తనకు తనకు తెలియదన్నట్లుగా మంత్రి జోగి రమేష్ మాట్లాడారు.
 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వసంత, మొండితోక తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నారన్న కేశినేని కామెంట్లపై జోగి రమేష్ ఆసక్తికర కామెంట్లు చేశారు. కేశినేని కామెంట్లు నేను చూడలా.. నేను వినలా అంటూ స్పందించారు. వసంత కృష్ణప్రసాద్ కు మంత్రి జోగి రమేష్ కు మధ్య గ్యాప్ ఉండటంతోనే ఈ విధంగా జోగి రమేష్ మాట్లాడారని అంటున్నారు.


గతంలో ఇద్దరి నేతల మధ్య సీఎం పంచాయితీ..
తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకోవటం, ఇసుక ర్యాంపుల విషయంలో జోగి ఇష్టాను సారంగా వ్యవహరిచటం, స్దానికంగా ఉన్న ఎమ్మెల్యే వసంతను కనీసం పట్టించుకోకుండా వ్యవహరించటంపై పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కూడా పంచాయితీ జరిగింది. అక్కడ కూడ జోగి రమేష్ కే జగన్ సర్దిచెప్పినట్లుగా చెబుతున్నారు. అయినా ఇప్పటికీ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికి జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలో తనదే పైచేయి కావాలని ప్రయత్నాలు చేయటంపై శాసన సభ్యుడు వసంత గుర్రుగా ఉన్నారు. మంత్రి జోగి తన పెడన నియోజకవర్గంను పట్టించుకోకుండా, మైలవరం నియోజకవర్గంలో వేలు పెట్టటంపై ఇప్పటికి వసంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.


వారసుడి కోసం జోగి ప్రయత్నాలు...
మంత్రి జోగి రమేష్ తన రాజకీయ వారసుడి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జోగి రమేష్ మైలవరంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. 2019ఎన్నికల ముందు వరకు జోగి రమేష్ మైలవరం నియోజకవర్గం కేంద్రంగానే పని చేశారు. అయితే ఆఖరి నిమిషంలో జోగి రమేష్ ను పార్టి అధినేత జగన్ పెడన నియోజకవర్గానికి పంపారు. మైలవరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కీలక నేత, అప్పటి మంత్రి దేవినేని ఉమాను ఓడించాలంటే అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన కీలక నేత అవసరం ఏర్పడింది. దీంతో సర్వే రిపోర్ట్ ల ఆధారంగా సీఎం జగన్ మైలవరం నియోజకవర్గం నుండి పని చేస్తున్న జోగి రమేష్ ను పెడనకు పంపి, అక్కడ వసంత ను రంగంలోకి దింపారు. వ్యూహం ప్రకారం దేవినేని ఉమాపై వసంత విజయం సాధించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి జెండా ఎగిరింది. ఇక్కడ వరకు సీన్ బాగానే నడిచింది.ఆ తరువాత నుండి అసలు సమస్య మెదలైంది. రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో జోగి రమేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత నుండి ఆయన మైలవరం పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. తన రాజకీయ వారసుడిని మైలవరం నుండి గెలిపించాలనే ప్రయత్నాలు చేసుకుంటున్నారని, అందుకే జోగి రమేష్ ఎక్కువగా మైలవరం పైనే ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు.