Liquor Policy in Andhra Pradesh | అమరావతి: ఏపీ ఎన్నికల్లో మద్యం ధరలపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎ పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మద్యం ధరల తగ్గింపు, నాణ్యమైన లిక్కర్ విక్రయాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ నుంచి అమల్లోకి రానుందని వినిపిస్తోంది. ఇందులో భాగంగా మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు తుది దశకు చేరుకుంది. పలు రాష్ట్రాల్లో మద్యం విధానంపై అధ్యయనం చేశారు. ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే, మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం అని హామీ ఇచ్చినా, అమలు చేయలేదని ప్రభుత్వమే లిక్కర్ విక్రయాలు చేపట్టిందని కూటమి నేతలు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీని రద్దు చేసి, గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పాత మద్యం పాలసీని అమలు చేయనున్నారు. అయితే లిక్కర్ పాలసీలో స్వల్ప మార్పులు చేయనుంది కూటమి ప్రభుత్వం. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందించేలా చర్యలు చేపడుతోంది. క్వార్టర్ బాటిల్ రూ.100 లోపే ఉండేలని భావిస్తోంది. దీని కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం బ్రాండ్ల కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. అధికారులు, లిక్కర్ సంస్థల యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమైతే వచ్చే నెల నుంచి ప్రముఖ బ్రాండ్లు ఏపీలో తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో నూతన మద్యం విధానంపై కసరత్తు చేస్తోంది. తెలంగాణ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లి ఆ రాష్ట్రాల్లో మద్యం విధానాన్ని పరిశీలించాయి. ఆయా రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీపై అధ్యయనం చేసిన ఎక్సైజ్ శాఖ ఏపీలో నూతన మద్యం విధానం రూపకల్పన చేస్తోంది. ఆరు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు, బార్లలో మద్యం ధరలు, మద్యం నాణ్యత, లిక్కర్ షాపులు, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ అధికారుల బృందాలు అధ్యయనం చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం ఆగస్ట్ 12వ తేదీలోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఎక్సైజ్ శాఖ పలు అంశాలను మద్యం పాలసీలో చేర్చడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. అంతా ఓకే అయితే అక్టోబర్ 1 నుంచి, లేక తొలి వారంలో ఎప్పుడైనా రాష్ట్రంలో ఈ కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.
గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో కింగ్ ఫిషర్ బీర్లు కనిపించేవి కావని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నాణ్యమైన మద్యం మళ్లీ అందుబాటులోకి తెచ్చిందని టీడీపీ, జనసేన నేతలు చెబుతున్నారు. ఏపీలో గంజాయి తీవ్ర ప్రభావం చూపుతోందని, డ్రగ్స్, గంజాయి రూపుమాపేందుకు కేబినెట్ సబ్ కమిటీ నియమించి చంద్రబాబు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇటీవల పలుమార్లు ప్రస్తావించారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని, అందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: రాజ్యసభలో మెజార్టీ సాధించనున్న ఎన్డీఏ - ఇక వైఎస్ఆర్‌సీపీ అవసరం బీజేపీకి లేనట్లే !