Jangareddigudem Deaths : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకూ 18 మంది మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున అనిల్‌ అనే వ్యక్తి చనిపోయారు. చికిత్స పొందుతూ ఒడిశా వాసి ఉపేంద్ర అనే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మరణాలపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. మరణాలపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. జంగారెడ్డిగూడెంలో అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరదరాజుల అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 


రోజుల వ్యవధిలో 18 మంది మృతి


కొన్ని రోజుల వ్యవధిలోనే 18 మంది మృతి చెందారు. కారణం ఏంటో తెలియట్లేదు కానీ మరణాలు మాత్రం ఆగడంలేదు. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నాటు సారా వల్ల మరణాలు సంభవించాయని భావించారు. కానీ అటువంటి ఆనవాళ్లు లేవని వైద్యులు తేల్చారు. ఈ వరుస మరణాలపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. వరుస మరణాలకు కారణాలు ఏంటో ఇప్పటి వరకూ అధికార యంత్రాంగానికి, వైద్య నిపుణులకు అంతుచిక్కడం లేదు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో విభాగాలు ఈ మరణాలకు కారణాలను అన్వేషిస్తున్నాయి. జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ ఘటనా స్థలిని సందర్శించి విచారణ చేస్తు్న్నారు. ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను జంగారెడ్డిగూడెంకు పంపింది. వైద్యుల పరీక్షల్లో చనిపోయిన వారిలో ఒక్కో వ్యక్తి ఒక్క రకమైన కారణాలతో చనిపోయినట్టు తేలిందన్నారు. ప్రధానంగా కిడ్నీల సమస్య సైడ్‌ ఎఫెక్ట్‌ వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. మద్యం తాగడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతోందన్నారు. 


మద్యం అలవాటే కారణమా?


జంగారెడ్డిగూడెంలో ఇప్పటికే 18 మంది మరణించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరో ఇద్దరు మృతి చెందారు. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వెంపల అనిల్ కుమార్ (40), ఉపేంద్ర (30) చనిపోయారు. అయితే 16 మందివి సహజ మరణాలేనని అధికారులు అంటున్నారు. మృతుల్లో ముగ్గురు వ్యక్తులు గత కొంతకాలంగా మద్యానికి బానిసలైనట్లు తెలిపారు.  ఖననం చేసిన ఓ వ్యక్తి నుంచి అధికారులు శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్షలకు పంపారు. మద్యం అలవాటే వరుస మరణాలకు కారణం కావచ్చని అధికారులు భావిస్తున్నారు.