AP High Court Issued Notices on Ganta Srinivasarao Resign Petition: విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta SrinivasaRao) రాజీనామా ఆమోదానికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు (AP Highcourt) సోమవారం విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శి, సీఈసీ, ఎస్ఈసీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కాగా, ఇటీవల గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని గంటా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 


ఇదీ జరిగింది


2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021, ఫిబ్రవరి 12న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంకు (Tammineni Seetharam) లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని అప్పట్లో స్వయంగా వెళ్లి స్పీకర్ ను కలిశారు. అప్పటి నుంచి గంటా రాజీనామా అంశం పెండింగ్ లో ఉండగా.. ఈ నెల 23న ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, స్పీకర్ నిర్ణయంపై గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా.? అని ప్రశ్నించారు. తాను అప్పుడు స్పీకర్ ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఆమోదించాలని చెప్పినా పెండింగ్ పెట్టారని.. ఇప్పుడు 3 నెలల్లో ఎన్నికలు ఉండగా ఆమోదించారని మండిపడ్డారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తీసుకోవాలనే కనీస సంప్రదాయాన్ని కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనతో జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోందని మండిపడ్డారు. సీఎం జగన్ (CM Jagan) లో రాజ్యసభ సీట్ల భయం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఆయనకు అనుమానంగా ఉందేమో అంటూ ధ్వజమెత్తారు. 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నా. రాజకీయ లబ్ధి కోసమే సీఎం జగన్ తన రాజీనామాను ఆమోదింపచేసి స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. జగన్ రెడ్డికి ఆత్మ గౌరవం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడే ధైర్యం సీఎంకు ఉందా.?. అరాచక వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను'. అంటూ గంటా స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.


స్పీకర్ ఏమన్నారంటే.?


అయితే, గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖను ఎప్పుడో స్పీకర్ ఫార్మాట్ లోనే సమర్పించారని.. లేఖ ఇవ్వగానే ఆమోదించడం సరికాదనే వేచి చూసినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. మానవతా దృక్పథంతో ఇప్పటివరకూ ఆగామని.. తన పదవీ కాలం ముగుస్తుండడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి రాజీనామాను ఆమోదించినట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు అవకాశం ఇచ్చినా గంటా తన నిర్ణయం మార్చుకోలేదని.. ఇప్పుడెలా మార్చుకుంటారని భావిస్తానని ప్రశ్నించారు.


అదే కారణమంటున్న టీడీపీ


అయితే, రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు మార్చిలో జరగనున్న నేపథ్యంలో తమ బలం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి, ఎమ్మెల్యేల బలాల ప్రకారం ఈ 3 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి. కానీ ప్రస్తుతం సీఎం జగన్ అభ్యర్థుల కసరత్తు చేస్తున్నారు. ఈ కారణంగా బదిలీ అయిన ఎమ్మెల్యేలు.. టిక్కెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు టీడీపీ వైపునకు వెళ్తే ఓ రాజ్యసభ స్థానం దక్కించుకోవడం కష్టమవుతుందన్న అంచనాలో ఆ  పార్టీ వ్యూహకర్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే టీడీపీ బలాన్ని వీలైనంతగా తగ్గించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. గంటా రాజీనామాను ఆమోదించే ముందు ఆయన్ను ఒక్క సారి కూడా సంప్రదించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 


Also Read: Chandrababu: IRR కేసులో చంద్రబాబుకు ఊరట - బెయిల్ రద్దుకు నిరాకరణ