ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంగళ్లు అల్లర్ల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు  లంచ్ తర్వాత రెండు పిటీ వారెంట్లపైన విచారణ జరిగే అవకాశం ఉంది. లంచ్ తర్వాతే చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు ఇస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.


అంగళ్ల కేసు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా ఉన్నారు. పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారని పోలీసులు అభియోగాలు మోపారు చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డీఆర్‌.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్‌ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గత ఏడాది ఏప్రిల్ లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా సీఐడీ చెబుతోంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏ-1గా, నారాయణను ఏ-2గా పేర్కొన్న సీఐడీ, నారా లోకేష్ ను ఏ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఏపీ-సీఐడీ 14వ నిందితుడిగా చేర్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో చేసిన మార్పుల ద్వారా లోకేష్ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని సీఐడీ ఆరోపించింది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనీ, అలైన్ మెంట్ ప్రక్రియ ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కు భూసేకరణకు సంబంధించిన అవకతవకలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్ లను నిందితులుగా చేర్చింది ఏపీ సీఐడీ. అయితే ఈ కేసులో నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు.


ఫైబర్ నెట్ కేసు
ఫైబర్‌ నెట్‌ కేసులో రూ.115 కోట్ల నిధులు దారిమళ్లించారని సిట్‌ దర్యాప్తులో తేలిందని సీఐడీ తెలిపింది. 2019లోనే ఈ కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో A1గా వేమూరి హరి ప్రసాద్‌, A2 మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారని పేర్కొంది. అయితే వేమూరి హరిప్రసాద్‌ చంద్రాబబుకు అత్యంత సన్నిహితుడని ఆరోపించింది. దీంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను ఉన్నట్లు సీఐడీ అభియోగాలు మోపింది. ఫైబర్ నెట్ కాంట్రాక్టును టెర్రా సాఫ్ట్‌ అనే సంస్థకు అక్రమ మార్గంలో టెండర్లు కట్టబెట్డారని సీఐడీ ఆరోపిస్తుంది. టెండర్‌ గడువు వారం రోజులు పొడిగించి ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపింది. ఈ వ్యవహారంలో వేమూరి హరిప్రసాద్ కీలకం వ్యవహరించారని, బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్‌ దక్కేలా చేశారని సీఐడీ అభియోగించింది. ఫైబర్‌ నెట్‌ ఫేజ్‌-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా రూ. 115 కోట్ల అవినీతిని సీఐడీ అధికారులు గుర్తించారు.