Raghu Rama Krishna Raju custodial torture case updates:   వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు  అరెస్ట్, ఆపై సీఐడీ కస్టడీలో జరిగిన  థర్డ్ డిగ్రీ వేధింపుల కేసు ఇప్పుడు ఐపీఎస్ అధికారుల మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, నాటి సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం  అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక దేశ పార్లమెంట్ సభ్యుడిని కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానిస్తూ..  అసలు ఎప్పటిలోగా సరెండర్ అవుతారు  అని నిందితుడైన ఐపీఎస్ అధికారిని న్యాయస్థానం నిలదీసింది.

Continues below advertisement

 పార్లమెంట్‌పై దాడి చేసిన వారితో పోలిక! 

 హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ కేసు తీవ్రతను వివరిస్తూ సంచలన పోలికను తెరపైకి తెచ్చింది.  దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులకు.. ఒక పార్లమెంట్ సభ్యుడిని   చట్టవిరుద్ధంగా కస్టడీలో పెట్టి శారీరకంగా వేధించిన వారికి మధ్య పెద్ద తేడా లేదు  అని హైకోర్టు అభిప్రాయపడింది. చట్టాన్ని రక్షించాల్సిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా తనను తాను నియంత్రించుకోవాల్సిన కనీస బాధ్యత లేదా అని ప్రశ్నించింది.

Continues below advertisement

 మీ పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి.. 

ఎంపీ రఘురామకృష్ణ రాజును గుంటూరు సీఐడీ ఆఫీసులో అర్ధరాత్రి వేళ బూటుకాళ్లతో తన్నుతూ, అరికాళ్లపై కొడుతూ అమానుషంగా హింసించబోతున్నారనే విషయం ఫిర్యాదుదారుగా ఉన్న సునీల్ కుమార్ నాయక్‌కు ముందే తెలుసని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఆయన కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా ఆధారాలు కనిపిస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఇలాంటి కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ముందస్తు బెయిల్  ఒక రక్షణ కవచంగా మారకూడదని బెంచ్ తేల్చిచెప్పింది.

 బెయిల్ కావాలా? సరెండర్ అవుతారా? 

న్యాయస్థానం ఘాటు వైఖరిని గమనించిన సునీల్ నాయక్ తరఫు న్యాయవాది  సైలెంట్ అయ్యారు.  దీంతో కోర్టు స్పందిస్తూ.. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొనసాగిస్తారా, లేక చట్టాన్ని గౌరవించి స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట సరెండర్ అయ్యే మార్గాన్ని ఎంచుకుంటారా అనేది తేల్చుకోవాలని స్పష్టమైన ఛాయిస్ ఇచ్చింది. దీనిపై పిటిషనర్‌తో మాట్లాడి కోర్టుకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని లాయర్ కోరడంతో.. హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి తుది ఉత్తర్వులు ఇవ్వకుండా తదుపరి విచారణను శుక్రవారానికి  వాయిదా వేసింది.

 కేసు బ్యాక్‌గ్రౌండ్ ఇదే

2021లో అప్పటి ఎంపీ రఘురామకృష్ణ రాజుపై సీఐడీ నాన్-బెయిలబుల్ కేసు పెట్టి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు. ఆ రోజు కస్టడీలో చిత్రహింసలు పెట్టారని రఘురామ ఆరోపించారు. ఆ విషయం అప్పట్లో వివాదాస్పదమయింది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, సునీల్ నాయక్,  పి. సీతారామాంజనేయులు  నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ , అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌లపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.   ఈ కేసులో ఇప్పటికే విజయ్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, అరెస్ట్ భయంతో సునీల్ నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో బీహార్ కు వెళ్లి అరెస్టు చేయాలనుకున్నారు. అయితే ఆయన అక్కడి పోలీసుల సాయంతో బయటపడ్డారు.