AP High Court rules cancel default bail of three close associates of Jagan: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాంలో ముఖ్య నిందితులైన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సన్నిహితులు కె. ధనుంజయ్ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ఈ నెల 26నలోగా వారు కోర్టు ముందు సరెండర్ అవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
గతంలో మూడు నెలల పాటు జైల్లో ఉన్న నిందితులు
సీఐడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తులో ఈ ముగ్గురు లిక్కర్ స్కాంలో డబ్బులను లంచాల రూపంలో తీసుకున్నారని గుర్తించారు. ధనుంజయ్ రెడ్డి , మాజీ IAS అధికారి, జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంవోను ఒంటి చేత్తో నడిపించారు. కృష్ణమోహన్ రెడ్డి జగన్ OSDగా ఉండేవారు. బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, షెల్ కంపెనీల ద్వారా లిక్కర్ స్కామ్ లంచాలను కంపెనీలోకి మళ్లించినట్లుగా సీఐడీ ఆరోపిస్తోంది.
చార్జిషీటు దాఖలు చేయలేదని డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్టు
వీరిపై అరెస్టు తర్వాత 90 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌లు దాఖలు చేసుకుని, ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. అయితే, సిట్ 'మేము సమయానికే చార్జ్‌షీట్ ఫైల్ చేశాం, కానీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు' అని వాదించి, హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణలో, 'దర్యాప్తు కీలక దశలో ఉంది, డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం ద్వారా న్యాయం దెబ్బతింటుంది' అని హైకోర్టు గుర్తించి, బెయిల్‌ను రద్దు చేసింది. ఈ తీర్పు ప్రకారం, 26న సరెండర్ కావాల్సి ఉంది.
సమయానికే చార్జిషీటు దాఖలు చేసినా బెయిల్ ఇచ్చారని హైకోర్టులో సిట్ పిటిషన్
లిక్కర్ స్కాంలో తమ పేర్లు ఉన్నందున ముందస్తు బెయిల్ కోసం వీరు గతంలో ప్రయత్నించారు. మే 2న హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌లు డిస్మిస్ చేసింది. మే 7న మళ్లీ డిస్మిస్. మే 16న సుప్రీంకోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్‌కు తీర్పు ఇవ్వకపోవడంతో, ధనుంజయ్, కృష్ణమోహన్‌లను సిట్ అరెస్టు చేసింది. బాలాజీని మే 14న కర్ణాటకలో పట్టుకుని విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు పరిచారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరికీ రెగ్యులర్ బెయిల్ మంజూరు కాలేదు.
లొంగిపోయి సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న నిందితులు
సిట్ రిపోర్టుల ప్రకారం, వైసీపీ హయాంలో మద్యం వ్యాపారాన్ని కొందరికే పరిమితం చేసి, డిస్టిలరీల నుంచి భారీ కమీషన్లు సేకరించారు. ఈ డబ్బును షెల్ కంపెనీల ద్వారా జగన్ పక్షానికి మార్చారు. మొత్తం రూ.3,000-3,200 కోట్ల అక్రమ సంపాదన చేసినట్లుగా గుర్తించారు. నిందితుల ఆస్తులను కూడా జప్తు చేస్తున్నారు. ఇప్పటికే చెవిరెడ్డి ఆస్తులను జప్తు చేశారు.