Margadarsi Case : మార్గదర్శి ఆఫీసుల్లో చట్టం ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ మాత్రమ తనిఖీలు చేయాలని.. అది కూడా ఆఫీసు పని వేళల్లోనే చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీఐడీతో పాటు ఇతర శాఖల అధికారులు తనిఖీలు చేయకూడదని స్పష్టం చేసంది. చిట్స్ రిజిస్ట్రార్ తనిఖీలు చేయాల్సి వస్తే 46-ఎ నిబంధన అనుసరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కల్పించవద్దని హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. చందాదారులకు ఫోన్ చేసి వేధింపులు, బెదిరింపులకు పాల్పడకూడదని హైకోర్టు తెలిపింది. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు తాజాగా తనిఖీలు చేయడాన్ని మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు తీర్పును వెలువరించింది.
ఏపీ ప్రభుత్వం మొత్తం 37 శాఖల్లో ప్రస్తుతం చేస్తున్న తనిఖీలను సవాల్ చేస్తూ మార్గదర్శి అధీకృత సంతకందారు పి.రాజాజీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.జయసూర్య నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. మార్గదర్శి తనిఖీల్లో సీఐడీ, స్టాంపులు, నిబంధనలు తదితర అధికారులు పాల్గొన్నారు. తనిఖీల పేరుతో మార్గదర్శి ఉద్యోగులకు విధుల నిర్వహణలో అధికారులు అడ్డంకులు కల్పిస్తున్నారని మార్గదర్శి తరపు న్యాయవాదులు వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ మరియు అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే శాఖలను తనిఖీ చేయడానికి , రికార్డులను ధృవీకరించడానికి అధికారం కలిగి ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెల్లారు.
చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 46 (ఎ) ప్రకారం రికార్డులను తనిఖీ చేసే అధికారం రిజిస్ట్రార్‌కు ఉందని ప్రభుత్వం కూడా వాదించింది. మార్గదర్శి శాఖల్లో పనికి అంతరాయం కలిగిందన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వ న్యాయవాది సుమన్ కోర్టుకు తెలిపారు. శాఖలకు తనిఖీకి సంబంధించిన ముందస్తు సమాచారం ఏమైనా ఇస్తున్నారా, పనివేళలకు మించి తనిఖీ కొనసాగుతుందా అని కోర్టు ప్రశ్నించింది. సోమవారం ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత, కోర్టు తన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది మరియు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు శాఖలను తనిఖీ చేయవద్దని మరియు రికార్డులను ధృవీకరించవద్దని అధికారులకు సూచించాలని ప్రభుత్వ ప్లీడర్‌కు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. బుధవారం ఈ మేరకు తీర్పు ప్రకటించింది.
హైకోర్టు ఆదేశాలతో ఇక సీఐడీ మార్గదర్శి కేసులో జోక్యం చేసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ సీఐడీనే ఈ కేసులో యాక్టివ్ గా ఉంటోంది. ఖాతాదారులతో ఫిర్యాదులు చేయించాలని తామే ప్రోత్సహిస్తున్నామని సీఐడీ చీఫ్ సంజయ్ గత ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఖాతాదారులతో మాట్లాడుతున్నట్లుగా కూడా చెప్పడంతో. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని.. కోర్టులో మార్గదర్శి తరపు లాయర్లు వాదించారు. ఇప్పటికే చిట్ గ్రూపులు నిలిపివేస్తామన్న నోటీసులను.. తెలంగాణ హైకోర్టు నిలుపుదల చేసింది.