AP High Court Ordered CID Inquiry in TTD Parakamani theft case: తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణిలో రవికుమార్ అనే క్లర్క్ చేసిన దొంగతనం వ్యవహారంపై సీఐడీ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును లోక్ అదాలత్‌లో హడావిడిగా రాజీ చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఐడీ ను ఆదేశించింది. అంతేకాకుండా నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు చేయాలని కూడా హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమలలో శ్రీవారి కానుకలు లెక్కించే పరకామణి విభాగంలో పని చేస్తున్న ఉద్యోగి రవికుమార్ ఓ సారి విదేశీ డాలర్లను తీసుకెళ్తూ దొరికిపోయారు. రవికుమార్ పై కేసు నమోదు చేశారు. టీటీడీ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టకుండా, ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. ఇది అక్రమాలను దాచిపెట్టే ప్రయత్నంగా సాధు పరిషత్ వంటి సంస్థలు ఆరోపించాయి. దీంతో సాధు పరిషత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. "పరకామణి చోరీ కేసును హడావిడిగా రాజీ చేయడం వెనుక పెద్ద అక్రమాలు ఉన్నాయి. టీటీడీ బోర్డు, అధికారుల పాత్రను సమగ్రంగా విచారించాలి" అని వారు వాదించారు.
గతంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ రికార్డులు సీజ్ చేయకపోవడపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో అప్పటిక్పపుడు పోలీసులు రికార్డులు సీజ్ చేసి కోర్టుకు సమర్పించారు. సోమవారం జరిగిన విచారణలో మొత్తం కేసు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని. డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించాలి. లోక్ అదాలత్ రాజీలో టీటీడీ బోర్డు, అధికారుల పాత్రను పూర్తిగా పరిశీలించాలని ఆదేశించింది. అదే విధంగా రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల స్థిరాస్తులు, చరాస్తులు, బ్యాంకు ఖాతాలపై విచారణ చేపట్టాలి. ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ ద్వారా వేరే వారికి బదలాయించారా అనే అంశాన్ని కూడా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. సీఐడీ , ఏసీబీ తమ దర్యాప్తు నివేదికలను తదుపరి విచారణలోగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది.
పరకామణి చోరీ కేసును మొదట బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చారు. రవికుమార్ పరకామణిలో చోరీ చేసి సంపాదించిన ఆస్తుల్లో చాలా కొద్ది మాత్రమే టీటీడీ పేరుపై రిజిస్టర్ చేయించారని.. వంద కోట్లకుపైగా ఆస్తులను నాటి టీటీడీలో ఉన్నకొంత మంది ఉన్నతాధికారులు, వైసీపీ నేతలు తమ బినామీల పేర్లతో రాయించుకున్నారన్న ఆరోపణలు చేశారు. వీటిపై విచారణకు ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సిట్ ను నియమించింది. ఇప్పుడు కోర్టు సీఐడీ.. ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించడంతో మొత్తం చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రవికుమార్ ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.