Hyderabad Latest News | హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చేతగాని హామీలు ఎవరు ఇవ్వమన్నారు? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బన్సీలాల్ పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ నుండి స్వయంగా ఆటో డ్రైవింగ్ చేసి, అక్కడి ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలుఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పుడు రెండేళ్లు పూర్తయినా ఆ మొత్తాన్ని చెల్లించలేదని గుర్తు చేశారు. వెంటనే ఆటో డ్రైవర్లకు చెల్లించాల్సిన రూ. 24 వేలు విడుదల చేయాలని తలసాని డిమాండ్ చేశారు.
లక్ష ఆటోలతో ఆందోళన చేస్తామని వార్నింగ్ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని తలసాని అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం లక్ష ఆటోలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు తలచుకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారు, జాగ్రత్త అని ప్రభుత్వ పెద్దలను హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల కుటుంబాల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని తలసాని వ్యాఖ్యానించారు.
161 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు- హరీష్ రావురాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా తయారైందని, 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆటో కార్మికులను మోసం చేసి ఓట్లు దండుకున్నాడని, ఏడాదికి రూ. 12,000 ఆటో కార్మికులకు ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. ఎర్రగడ్డలో ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు. అనంతరం ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ కు ఆటోలో బయలుదేరారు.
రేవంత్ రెడ్డి రెండేళ్లలో ఆటో కార్మికులకు ఏ ఒక్క హామీ అమలు చెయ్యకపోగా, తమ అనాలోచిత నిర్ణయాలు, మోసపూరిత హామీలతో ఆటో కార్మికులను రోడ్డు పైన పడేశారు. ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24 వేల రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు.. మంత్రి వర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునన్నారు. అడ్లూరీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై కొప్పుల ఈశ్వర్ స్పందించారు. కొప్పుల ఈశ్వర్ సవాల్ ను స్వీకరించి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరకు మంత్రి లక్ష్మణ్ రావాలన్నారు.