ఏపీ రాజధాని అంశంపై విచారణ చేస్తున్న హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై విచారణ జరపడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల చట్టబద్ధతపై విచారణ చేస్తున్నామని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా అన్నారు. ఏపీ రాజధాని వ్యాజ్యాలపై వరుసగా నాలుగో రోజు హైకోర్టు విచారణ చేసింది. సీనియర్‌ న్యాయవాదులు ఆదినారాయణరావు, ఉన్నం మురళీధర్‌లు రైతుల తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు నిర్ణయంపై ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైసీపీ వ్యతిరేకించలేదని తెలిపారు. 


Also Read:  దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !


ప్రతిపక్ష నేతగా అమరావతికి ఓకే


సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అంగీకరించారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అవసరమైతే ఆ వీడియోలు ప్రదర్శిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారన్నారు. రాష్ట్రం మధ్యలో ఉండటం, అన్నింటికి అనుకూలమైన ప్రాంతంతో కావడంతో అమరావతిలో రాజధాని నిర్మించడానికి గత ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికలో రాజధానిపై పలు రకాల సూచనలు చేశారని కోర్టుకు న్యాయవాదులు తెలిపారు. మెజారిటీ ప్రజలు రాజధానిని అమరావతిలో ఏర్పాటుచేయాలని కోరుకున్నారని ధర్మాసనానికి తెలియజేశారు. ఆమోదించిన మాస్టర్‌ ప్లాన్‌ను మార్చేందుకు వీల్లేదని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎవరూ కోర్టులో సవాలు చేయలేదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్న వారంతా గతంలో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.  


Also Read: పరిషత్ ఉపఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీ హవా..పుంజుకున్న టీడీపీ ! పూర్తి ఫలితాలు ఇవే


మూడు రాజధానులపై వ్యతిరేకత


చరిత్రలో ఒక్కచోటే రాజధాని ఉందని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం 3 రాజధానులపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పునర్విభజన చట్టంలో ఒకటే రాజధాని అని ఉందని తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రైతుల తరఫు న్యాయవాది ఆదినారాయణరావు చదివి వినిపించారు. సీఆర్‌డీఏ ఏర్పడిన తర్వాత అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పుడు పునరాలోచన చేయడం అనేది అభివృద్ధికి విఘాతం కలిగించడమేనన్నారు. తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.


Also Read:  బంగాళాఖాతంలో వాయుగుండం.. దంచికొడుతున్న వానలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి