AP HC On Cm Jagan: అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూమిని ఇతరులకు ఉచితంగా ఇవ్వడానికి వీళ్లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్ట నిబంధనల మేరకు 5 శాతం భూమిలోనే ఇళ్ల నిర్మాణానికి వెసులుబాటు ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదపు ఏజీ(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. రాజధాని అమరావతిలో రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా సీఆర్డీఏ చట్టానికి సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని భూసమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు కల్లం పానకాల రెడ్డి, రైతు ఎ. నందకిశోర్ వేర్వేరుగా వ్యాజ్యాలు వేసిన విషయం అందరికీ తెలిసిందే. వీటిపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 


భూములపై హక్కులు కోల్పోవానికి రైతులు అంగీకరించారు...


రాజధాని అమరావతి పరిధిలో ఇళ్ల స్థలాలిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. సీఆర్డీఏతో జరిగిన ఒప్పంద ప్రకారం భూములపై హక్కులను కోల్పోవడానికి రైతులు అంగీకరించారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని కోరే హక్కు మాత్రమే వారికి ఉంటుంది. రైతులకు ప్లాట్లు ఇచ్చాకే రాజధానిలో భూమిని ఇతర నిర్మాణాల కోసం వినియోగించాలంటే ఎలా, హైకోర్టు, సచివాలయం తదితర నిర్మాణాలు ఇప్పటికే జరిగాయి. హ్యాపీనెస్ట్ పేరుతో ఉన్నత వర్గాల కోసం ఇళ్ల ప్రాజెక్టు తలపెట్టినప్పుడు ఏ ఒక్కరూ అభ్యంతరం తెలపలేదు అని గుర్తు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అమరావతిని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధ చేసేందుకు సీఆర్డీఏకు చట్టబద్ధత కల్పించి, భూములను సమీకరించారని ఈ క్రమంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీళ్లేదని పిటిషనర్లు చేస్తున్న వాదనలకు మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఆర్డీఏ, ప్రభుత్వం రెండూ వేర్వేరు అని తెలిపారు. నిర్ధిష్ట అవసరం కోసం రైతులు ఇచ్చిన భూమిని ఇతరులకు ఉచితంగా ఇవ్వడానికి వీళ్లేదని వివరించారు. 


నాలుగు వారాల సమయం కావాలని కోరిన ఏఏజీ..


పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు భూమి కేటాయించాలని సీఆర్డీఏను ప్రభుత్వం ఎలా ఆదేశిస్తుందన్నారు. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్ వేసేందుకు ఎంత సమయం కావాలని ఏఏజీని కోరింది. నాలుగు వారాలు సమయమివ్వాలని ఏఏజీ కోరగా... ఇప్పటి వరకు ముందుకు వెళ్లకుండా ఉండగలరా అని ప్రశ్నించింది. ఏఏడీ బదులిస్తూ.. తాము చేపట్టే చర్యలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని ఆదేశాలిస్తే అభ్యంతరం లేదన్నారు. కోర్టు సమయం అయిపోవడంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూ. దుర్గాప్రసాద రావు, జస్టిస్ టి, మల్లికార్జున రావుతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు రైతుల తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ ప్రధాన చట్టానికి తూట్ల పొడిచేలా సవరణ చట్టం చేశారు. మాస్టర్ ప్లాన్ మార్చే అధికారం ప్రభుత్వానికి, సీఆర్డీఏలకు లేదని వెల్లడించారు.