Telugu News: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త కార్డుల జారీని ప్రారంభిస్తామని.. మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేసే విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వం రేషన్ కార్డులపై అప్పటి సీఎం జగన్ బొమ్మను కూడా ముద్రించుకున్నందున ఇప్పుడు వాటి మార్చేసి.. అందరికీ కొత్త కార్డులను జారీ చేయనున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలన చేస్తున్నారు. 


ఏపీలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌ కార్డులు ఉండగా.. ఇందులో 89 లక్షల రేషన్‌ కార్డులకు ఆహారభద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తూ ఉంది. మిగిలిన కార్డులకు రేషన్‌ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్రం డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం అంగీకరించడం లేదు. 


గతంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం 5 రోజుల్లోనే అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ, గత ఐదేళ్లలో కొత్త కార్డులకు కోత పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 2019 జూన్‌ నాటికి రాష్ట్రంలో 1,47,33,044 రేషన్‌ కార్డులు ఉండగా.. 2024 ఆగస్టుకి 1,48,43,671 ఉన్నాయి. గత ఐదేళ్లలో పెరిగిన కార్డులు 1.10 లక్షలుగా ఉంది. పెళ్లైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే.. అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్‌ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. ఇది వైసీపీ ప్రభుత్వం హాయాంలో జరగలేదు. ఫలితంగా కొత్తగా పెళ్లైన వారికి కార్డులు ఇవ్వలేదు. దీంతో మ్యారేజీ సర్టిఫికేట్ చూపిస్తే కొత్త జంటకు రేషన్‌ కార్డు ఇస్తామని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.