AP Govt : వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం అమలులో భాగంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్‌తో రాష్ట్ర రెవెన్యూ శాఖ అవగాహన కుదుర్చుకోగా, గురువారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం తరపున సర్వే సెటిల్మెంట్స్ , ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జరుగుమిల్లి రామకృష్ణారావు ఒప్పంద పత్రాలపై ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్ సమక్షంలో సంతకాలు చేశారు.
భూ యాజమాన్య వివాదాలు పరిష్కారించేందుకు
ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను రూపొందించటం ద్వారా రాష్ట్రంలో టైటిల్ సిస్టమ్ నమోదు సులభతరం అవుతాయని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్ వివరించారు. పౌరులకు వివాదరహిత భూ యాజమాన్యాన్ని అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ‘వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ-రక్షా పథకం’ ప్రారంభించిందన్నారు. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన ఏవైనా కొత్త సేవలను అందించేందుకు కూడా ఈ ఒప్పందం ఉపయోగడుతుందని వివరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూమి హద్దులను పునఃపరిశీలించి సర్వే సెటిల్మెంట్స్ , ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. భవిష్యత్తులో భూ యాజమాన్య వివాదాలను తొలగించి టైటిల్ సిస్టమ్‌ను అమలు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం ప్రయోజనాలపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ సేవలు సద్వినియోగం అవుతాయని, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ "వెబ్‌ల్యాండ్ సిస్టమ్" కింద అన్ని సేవలు అందిస్తుందని సిద్దార్థ జైన్ స్పష్టం చేశారు.
కీలక నిర్ణయాలు
ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకం అమలుకు అవసరమైన అన్ని మార్గాల్లోనూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన ఫలితాలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు జాతీయ స్థాయిలో ఈ పథకాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని చెబుతున్నారు. ఇకపై రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నారు.