AP Govt Employees : ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడంతో ఏపీ ఎన్జీవో సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేతలు విమర్శలు చేస్తున్నారు.  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై విమర్శలు చేస్తున్నారు ఇతర సంఘాల నేతలు. తాజాగా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ... 2018 నుంచి డీఏ, ఇతర బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదన్నారు.  ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నందుకు ఉద్యోగ సంఘాల నేతలుగా సిగ్గు పడుతున్నామన్నారు. వేతనాల కన్నా ముందు పెన్షన్‌ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం మర్యాద నిలబెట్టుకోవాలన్నారు. ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరవుతుందన్న వార్తలను స్పందించిన బండి శ్రీనివాసరావు... ఉద్యోగుల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామన్నారు. ప్రభుత్వానికి ఎన్జీవో సంఘం దగ్గరవ్వడంలేదన్నారు. 


ఇతర సంఘాలపై విమర్శలు సరికాదు- బండి శ్రీనివాసరావు


ఉద్యోగుల సమస్యలను గవర్నర్‌ దగ్గర చెప్పుకోవాలి కానీ, ఇతర సంఘాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను ఉద్దేశించి బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవో సంఘం చాలా ఏళ్ల క్రితం ఏర్పడిందని గుర్తుచేశారు. ఏపీజీఈఏకు ఎలా అనుమతి వచ్చిందో అందరికీ తెలుసన్నారు.  ఏపీ ఎన్జీవో సంఘం సాధించిన కారుణ్య నియామకాల ఉత్తర్వుల వల్లే సూర్యనారాయణకు ఉద్యోగం వచ్చిందని స్పష్టం చేశారు. సూర్యనారాయణ అధ్యక్షత వహిస్తున్న ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయాలని సీఎస్‌ను కోరతామని బండి శ్రీనివాసరావు అన్నారు. ఏపీ ఎన్జీవో కార్యవర్గంతో పాటు జేఏసీ సమావేశాల్లో చర్చించి తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.  


ఆయన ఛాంపియన్ మేం చవటలా? 


సూర్యనారాయణ తీరుపై ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు.  సూర్యనారాయణ ఉద్యోగ సంఘాలను విమర్శించడం మానుకోవాలన్నారు.  ఆయన ఉద్యోగుల గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. సూర్యనారాయణ ఛాంపియన్‌లా, ఇతర ఉద్యోగ సంఘాల నేతల్ని చవటల్లా చిత్రీకరిస్తే ఊరుకోమన్నారు. 11 పీఆర్సీలు సాధించిన ఘనత ఏపీ ఎన్జీవో సంఘానికి ఉందన్నారు. గవర్నర్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడకుండా తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  సూర్యనారాయణ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను తాకట్టు పెట్టుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ చర్చలకు పిలిస్తే, సూర్యనారాయణ ఎందుకు శ్రీకాకుళం పారిపోయారని బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. 


పబ్లిసిటీ స్టంట్ - వెంకట్రామిరెడ్డి 


 ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్‌ కలవడం పబ్లిసిటీ స్టంట్‌ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం  జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించినట్టు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించిన తర్వాత గవర్నర్‌ను కలవడం ఏంటని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ  ప్రభుత్వంలోనే వీఆర్‌ఏలు, ఎండీవోలకు పదోన్నతులు వచ్చాయని గుర్తుచేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొహిబిషన్‌ డిక్లేర్‌ చేశారన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘంపై విమర్శలు చేశారు.  


చట్టం చేయమంటే, సంఘం గుర్తింపు రద్దు చేస్తారా? 


 ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు చేసిన విమర్శలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగుల సర్వీసులను నియంత్రించే అధికారం గవర్నర్‌కే ఉంటుందని, అందుకే ఆయనను కలిశామన్నారు. గవర్నర్ వద్ద వేరే సంఘం పేరు కానీ, ఇతర సంఘం నేతల ప్రస్తావన కానీ తీసుకురాలేదన్నారు. ఉద్యోగుల వేతనాలు ఒకటో తేదీనే చెల్లించాలని చట్టం ఉందని చెప్పిన ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు దానిని నిరూపించాలని డిమాండ్‌ చేశారు. చట్టంలో అలా ఉంటే తాము క్షమాపణ కోరతామని సూర్యనారాయణ తెలిపారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని జీవోలు ఉన్నాయి కానీ, చట్టం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల సంఘం రేపట్నుంచి సమ్మె చేయడానికి సిద్ధంగా లేదని, కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తామన్నారు. తమ సంఘం గుర్తింపును రద్దు చేయమని ఫిర్యాదు చేసే హక్కు వాళ్లకు ఉంటుందని, జీతాల కోసం చట్టం చేయమంటే సంఘం గుర్తింపు రద్దు చేయమంటారా? అని బెదిరింపులకు పాల్పడతారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దొడ్డిదారిన గుర్తింపు తెచ్చుకోలేదని సూర్యనారాయణ స్పష్టం చేశారు.