సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం కొనసాగుతోంది. హెచ్ఆర్ఏ శ్లాబుల విషయమై కొత్త ప్రతిపాదనలను మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘ నేతల ముందు ఉంచింది. 
హెచ్ఆర్ఏ శ్లాబుల కొత్త ప్రతిపాదనలు



  • 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్ తో 8 శాతం హెచ్ఆర్ఏ

  • 2 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్ తో 9.5 శాతం 

  • 5 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 12 వేల సీలింగ్ తో 13.5 శాతం 

  • 10 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 15 వేల సీలింగ్ తో 16 శాతం 

  • 25 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగ్ తో 16  శాతం

  • సెక్రటేరీయేట్, హెచ్వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు రూ. 23 వేల సీలింగ్ తో 24 శాతం


ఫిట్మెంట్ 23 శాతమే : మంత్రుల కమిటీ 


ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తేల్చిచెప్పింది. ఐఆర్ రికవరీని చేయబోమని స్పష్టం చేసింది. మట్టి ఖర్చుల నిమిత్తం రూ. 25 వేల ఇచ్చేందుకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. ఐదేళ్లకోసారి పీఆర్సీని అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రొబేషన్ అనంతరం కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఇస్తామని వెల్లడించింది. ఇంకా చర్చించాల్సిన అంశాలను ఎనామలీస్ కమిటీకి పంపుతామని ఉద్యోగ సంఘాలకు తెలిపింది. ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల డిమాండ్ లతో ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో ఆర్థికశాఖతో చర్చించాలన్నారు. ఫిట్‌మెంట్‌ 23 శాతంలో మార్పు ఉందని తెలిపారు. సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌(సీసీఏ) రద్దు చేయొద్దని ఉద్యోగులు కోరారన్నారు. హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులే కొనసాగించాలని ఉద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని తెలిపారు. కనీస హెచ్‌ఆర్‌ఏ 12 శాతం ఉండాలని ఉద్యోగులు అడిగారన్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల సవరణతో రూ.7 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని సజ్జల అన్నారు. 


ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని పరిష్కరించాం: మంత్రి బొత్స 


పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో మంత్రుల కమిటీ శనివారం భేటీ అయింది. ఈ మధ్యాహ్నం పీఆర్సీ సాధన సమితి నేతలతో మంత్రులు సమాలోచనలు చేస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు మంత్రుల కమిటీ శుక్రవారం అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపారు.  ఐఆర్‌ రికవరీ చేయబోమని పీఆర్‌సీని ఐదేళ్లకొకసారి ఇస్తామని మంత్రుల కమిటీ నుంచి ఉద్యోగ సంఘ నేతలకు హామీ ఇచ్చింది. మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారించామన్నారు.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, ఐఆర్‌ రికవరీ విషయంలో స్పష్టత ఇచ్చామన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.6 వేల కోట్ల అదనపు భారం ఉండొచ్చన్నారు. ఇక మిగిలిన సమస్యలు చిన్నవని, అవి కూడా త్వరలో పరిష్కారం అవుతాయన్నారు. చర్చల అనంతరం అన్ని అంశాలు సీఎం జగన్‌కు వివరిస్తామని మంత్రి బొత్స అన్నారు.