ఒకటో తేదీ వస్తోందంటే.. ఆంధ్రప్రదేశ్‌లో  ఓ రకమైన ఉద్విగ్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ప్రభుత్వానికి.. ఇటు ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటే టెన్షన్. తమ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో.. అది జీతాలివ్వడానికి సరిపోతుందో లేదో అని  ఏపీ ఆర్థిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చూసుకుంటూంటే.. తమ అకౌంట్లలో జీతాలు పడ్డాయో లేదో అని.. ఉద్యోగులు, పెన్షనర్లు ఫోన్ల వైపు చూసుకుంటూ ఉంటారు.  ఈ నెల కూడా అంతేనా.. తమ పరిస్థితి ఇంతేనా అని ఉద్యోగులు అనుకుంటున్నారు.  ఒకటో తేదీనే అందరికీ జీతాలు అందడం కష్టంగా కనిపిస్తోంది. కిందటి నెల మాదిరిగానే పదిహేనో తేదీ వరకు విడతల వారీగా జీతాలు జమ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే బ్యాంకుల నుంచి అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొన్ని సానుకూల సంకేతాలు కూడా ఉన్నాయి.  ఆ ప్రయత్నాలు సక్సెస్ అయితే ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు అందే అవకాశం ఉంది. 


ఆదాయం నిల్... ఖర్చులు ఫుల్


కరోనా కారణమో... వ్యవస్థ సరిగ్గా లేకపోవడమో.. కారణమేదైనా కానీ.. ఒకటోతేదీకి మాత్రం ఆర్థిక శాఖ అల్లాడిపోతోంది. ఒకటో తేదీ వచ్చే నాటికి.. ప్రభుత్వం చెల్లించాల్సినవి దాదాపుగా రూ.13వేల కోట్ల వరకూ ఉంటున్నాయి.  వాలంటీర్లను పెట్టి ఒకటో తేదీనే సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వాటికి రూ. పదిహేను వందల కోట్ల వరకూ కావాలి. ఇక ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు ఐదున్నర వేల కోట్ల రూపాయలకు పైగానే కావాలి.  నెలవారీగా రుణాల కోసం చెల్లించాల్సిన వాయిదాలు, వడ్డీలు ఇలా అన్నీ కలిపి దాదాపుగా రూ. 13వేల కోట్ల రూపాయలు అవసరం. కాగ్ విడుదల చేసిన ఏప్రిల్ నెల లెక్కలు చూస్తే... ఆ నెల ఖర్చులు గడవడానికి రూ. 19వేల కోట్లకుపైగా అప్పులు చేయాల్సి వచ్చింది.  ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వం అన్ని మార్గాల ద్వారా చేసిన అప్పు రూ.19,717 కోట్లు.  అన్ని మార్గాలు అంటే.. ఆర్బీఐ ద్వారా బాండ్లను వేలం వేయడం, బ్యాంకుల నుంచి సేకరించడం.. ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవడం వంటివి.  


జూన్‌లో కటకట.. జూలై పరిస్థితేంటో...


నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతోంది. కొన్ని శాఖల ఉద్యోగులకు రెండు వారాలు దాటినా జీతాలు రాని పరిస్థితి. జూన్‌ నెలకు సంబంధించి మొదటి 15 రోజులకు దాదాపు 50శాతం మంది పెన్షన్ దారులకు, 20శాతం మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. పెన్షన్ల కోసం రిటైర్డ్ ఉద్యోగులు బ్యాంకులు చుట్టూ తిరిగిన దృశ్యాలు కనిపించాయి. ఇక ఈనెల జీతాల పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.


 
గవర‌్నమెంట్ ఆన్ ఓడీ


వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా ఓవర్ డ్రాఫ్టుల మీద నెట్టుకొస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులు ఆటంకం కలగకూడదని గట్టి పట్టుదలతో ఉన్న ప్రభుత్వం అందుకోసం ఉన్న నిధులన్నింటినీ ఖర్చుచేస్తోంది. జీఎస్‌డీపీలో అప్పులు శాతం దాదాపు ౩6శాతానికి చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే.. ఇది 5 శాతం పెరిగింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్నీ ప్రయత్నాలూ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి అనుమతించిన రుణంలో డిసెంబర్ నెలవరకూ వాడాల్సిన దానిని ఇప్పటికే వాడేశారు. వచ్చే జనవరి-మార్చి మధ్య చేయాల్సిన రుణమొత్తాన్ని ఇప్పుడే మంజూరు చేయించుకునేందుకు ఆర్థిక మంత్రి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరకు ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం బాండ్ల వేలం కూడా వేస్తోంది.  



ప్రతీ నెలా రూ. ఆరు వేల కోట్లు..


మధ్య తరగతి ఉద్యోగికి జీతాలు వచ్చినట్లుగా ఏపీ సర్కార్‌కు కూడా ఒకటో తేదీన కొంత మొత్తం కేంద్రం నుంచి వస్తుంది. జీఎస్టీ సర్దుబాట్లు, పన్నుల వాటా, కేంద్ర పథకాల నిధులు.. ఇలా పలు రకాల సోర్స్‌ల ద్వారా కొంత మొత్తం ఆదాయం.. ఏపీ ఖాతాకు జమ అవుతుంది. అయితే అది మరీ భారీగా ఉండదు. మూడు నుంచి నాలుగు వేల కోట్ల మధ్యనే ఉంటుందని అంచనా. ఒక్కో నెల ఇది రూ.రెండు వేల కోట్లే ఉన్నా ఆశ్చర్యం లేదు. మిగతా రూ.6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వచ్చిన మొత్తం వచ్చినట్లుగా వివిధ రకాల అత్యవసర చెల్లింపులకు వినియోగిస్తోంది. అంటే... ఇప్పుడు జీతాలు చెల్లించాలంటే కచ్చితంగా అప్పు తేవాల్సిందే.  మూడు నెలల నుంచి ఆర్బీఐలో వారానికి రెండువేల కోట్ల రూపాయల బాండ్లను వేలం వేయడం ద్వారా నిధులు సమకూర్చుకుని జీతాలిస్తున్నారు. దీని వల్ల ఉద్యోగులకు చాలా ఆలస్యంగా జీతాలొస్తున్నాయి. 


అప్పుల ఖాతా మూసేసిన ఆర్బీఐ..!


ఈ సారి ఆర్బీఐ కూడా..  బాండ్ల వేలానికి అడ్డుపుల్ల వేసే ఛాన్స్ ఉంది. ఆర్బీఐ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితిని నిర్దేశిస్తుంది. ఆ రుణపరిమితిని రెండు భాగాలుగా చేస్తుంది. డిసెంబర్ వరకూ ఓ భాగం.. డిసెంబర్ నుంచి మార్చివరకూ మరో భాగం అప్పులు తీసుకునేందుకు అవకాశం ఉంది.  ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42,472 కోట్లు రుణాలుగా తీసుకోవచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఏపీ చేసిన అప్పుల లెక్కలను తీసుకున్న కేంద్రం... రుణ పరిమితిని రూ.27,668 కోట్లుగా తేల్చింది. కానీ ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలకుపైగా ఎక్కువగా అప్పులు తీసుకుందని కేంద్రం తేల్చింది. అందుకే ఇక రుణం తీసుకునే అవకాశం కూడా కల్పించకపోవచ్చు అంటున్నారు. ఈ కారణంగానే ఆగస్టు ఒకటో తేదీన జీతాలు సమయానికి రావడం కష్టమని లెక్కలేస్తున్నారు.