Tomato Price In AP: మార్కెట్లో టమాటా ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ ఉపశమనం కల్పించింది.  రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో  కిలో రూ.50 టమాటాను విక్రయించడానికి నిర్ణయం తీసుకుంది.


సర్కార్ ధర 50 రూపాయలు..
బహిరంగ మార్కెట్ లో టమోటా ధర మోత మోగిపోతోంది. దీంతో సామాన్యడు టమాటా వైపు చూడాలంటేనే భయపడే పరిస్దితి నెలకొంది. టమాటా ధరలను నియంత్రించే క్రమంలో భాగంగా రైతుబజార్లలో విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీ 50రూపాయల చప్పున టమాటా విక్రయాలు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లను కూడ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రజలకు నిత్యావసర కూరగాయల అంశంలో ఊరట లభించింది. కడప, కర్నూలులోని రైతు బజార్లలో  ఇప్పటికే మార్కెటింగ్ శాఖ టమాట విక్రయాలను ప్రారంభించింది. ''సబ్సిడీ ధర పై టమాటా విక్రయాలు శుక్రవారం నుంచి మరిన్ని జిల్లాల్లో ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ క్రమంగా టమాటా విక్రయాలు ప్రారంభం కానున్నాయి” అని రైతు బజార్ల సీఈఓ నంద కిషోర్ తెలిపారు. 


త్వరలోనే ధరలు తగ్గుతాయి...
మార్కెట్‌లో ప్రస్తుతం టమాటాల కొరత అతి కొద్ది కాలంలోనే తీరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్రం తెలియజేసినట్లు వివరించారు. డిమాండ్‌, సప్లయ్‌ల మధ్య పొంతన లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని అధికారులు అంటున్నారు. కూరగాయలు ఎక్కువగా పండే ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడం పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో కూరగాయల సరఫరా తగ్గడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో టమాటా పెద్ద ఎత్తున లభిస్తున్నాయని, మన రాష్ట్రం తో పాటుగా ,  ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా మదనపల్లి మార్కెట్‌ పైనే ఆధారపడి సరఫరా చేస్తున్నారని అన్నారు.  మార్కెట్‌కు సరఫరా మరియు రాకపోకల ఆధారంగా,  రైతు బజార్‌లలో విక్రయించడానికి ఉత్పత్తిని సేకరిస్తున్నామని వివరించారు.  మరో రెండు రోజుల్లో విశాఖపట్నంతో పాటు ఇతర జిల్లాల్లోని రైతు బజార్లకు టమాటా సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం  అని నంద కిషోర్ వివరించారు.


బహిరంగ మార్కెట్ లో టమాటా ధరల మంట...
బహిరంగ మార్కెట్‌లో టమాటా ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మదనపల్లెలో బుధవారం ఉదయం కిలో రూ.70 ఉన్న టమాటా సాయంత్రం రూ.135కు చేరగా.. మరుసటి రోజు కిలో రూ.85కి చేరింది. రైతు బజార్లు పంపిన ఇండెంట్ల ఆధారంగా ప్రభుత్వం టమోటాలను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం వినియోగదారులకు కిలో రూ.50కి విక్రయిస్తున్న టమాటా పరిమాణంపై ఎలాంటి పరిమితి విధించలేదని అధికారులు అంటున్నారు.  శుక్రవారం నాటికి  10 టన్నుల టమోటాలను సబ్సిడీగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని విజయవాడలోని రైతు బజార్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని రైతు బజార్‌లో కూడా ఇదే విధానం అమలుకు ప్రయత్నిస్తున్నారు. 
కర్నూల్ నగరంలోని సి క్యాంప్ రైతు బజార్‌లో సబ్సిడీ ధర పై టమాటా విక్రయాన్ని మార్కెటింగ్ శాఖ అధికారికంగా ప్రారంభించింది, ఇది రాష్ట్రంలోనే అతిపెద్దది. రైతుబజార్ ఎస్టేట్ అధికారి టి హరీష్ కుమార్ మాట్లాడుతూ.. మదనపల్లె మార్కెట్ నుంచి 7 టన్నుల టమోటాలు వచ్చాయని, అవి కర్నూలు నగరంలోని మూడు రైతు బజార్లకు కేటాయించినట్లు తెలిపారు.